డిజిటల్ సర్వే వచ్చే సర్వేయర్లకు సహకరించాలి
* ఉట్నూర్ ఆర్డీవో రాథోడ్ మోహన్ సింగ్
ఉట్నూర్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి పథకంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో రైతుల సాగు భూములను డిజిటల్ సర్వే చేసేందుకు వచ్చే సర్వేయర్లకు రైతులు సహకరించాలని ఉట్నూర్ ఆర్డీవో రాథోడ్ మోహన్ సింగ్ అన్నారు. బుధవారం కేస్లాపూర్ లోని రైతు వేదికలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన హీరాపూర్, మామిడిగూడ (జి ), మల్లాపూర్, డోంగర్గావ్ గ్రామాల రైతులకు సర్వేపై అవగాహన కల్పించారు.
డిజిటల్ సర్వేకు వచ్చే అధికారులకు తమ భూమి సరిహద్దులను చూపిస్తే డిజిటల్ ద్వారా రైతు కున్న భూమి వివరాలు హద్దులు గుర్తించడంతోపాటు భూధాన్ పట్టేదారు పాస్ పుస్తకం అందజేసే సమయంలో భూమి హద్దులను సైతం మ్యాపులు అందజేస్తామన్నారు. ప్రతి రైతు తమ భూములను అధికారులకు చూపించాలని సూచనలు చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఏడి ఎల్.ప్రభాకర్ మాట్లాడుతూ... జిల్లాలో 70 గ్రామాలను ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిందని గుర్తు చేశారు. రేపటినుండి ఎంపిక చేసిన గ్రామాలకు వచ్చే సర్వే అధికారులకు తమ భూమి సరిహద్దులను చూపడంతో పాటు సర్వే అయ్యేవరకు వారితో ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, డివిజన్ ఇన్స్పెక్టర్ రాథోడ్ జయరాం, మండల సర్వేయర్ లక్ష్మి, సర్పంచ్ మెస్రం తుకారం, రెవిన్యూ సిబ్బంది, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.






