5 August, 2026 | 8:10 PM

వర్షాభావానికి చెక్ ఫామ్ పాండ్స్ నిర్మించుకోవాలి

05-08-2026 07:16 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి/రేగొండ,(విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనడానికి రైతులు తమ పొలాల్లో ఫామ్ పాండ్స్ (పంట కుంటలు) నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. బుధవారం రేగొండ మండలం గూడెపల్లి గ్రామంలో పర్యటించిన కలెక్టర్, రైతు లింగంపల్లి సంతోష్ రావు నిర్మించిన ఫామ్ పాండ్‌ను పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా జల సంరక్షణ ప్రాధాన్యతను వివరించారు. వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి, వర్షాభావాన్ని అధిగమించవచ్చని తెలిపారు.

ఫామ్ పాండ్స్ ద్వారా పంటలకు రక్షణతో పాటు చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వ పథకాల సహకారంతో ఫామ్ పాండ్స్ నిర్మాణాన్ని విస్తరించుకోవాలని సూచించారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద జిల్లాకు 214 ఫామ్ పాండ్స్ మంజూరు కాగా, వాటిలో 131 పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఫామ్ పాండ్స్ నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచిందని వెల్లడించారు.