5 August, 2026 | 7:56 PM

అప్రమత్తతే ప్రతి ఒక్కరికి రక్షణ

05-08-2026 07:01 PM

కేటీపీపీలో ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

గణపురం,(విజయక్రాంతి): అప్రమత్తతే ప్రతి ఒక్కరికి రక్షణ అని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చెల్పూర్ లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ)లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు “సురక్షా కా తిరంగా” కార్యక్రమంలో భాగంగా సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, పాల్గొని మాట్లాడారు. నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాల్లో పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటేనే వాటిని సమర్థవంతంగా నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించే సమయంలో తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దని సూచించారు. అదేవిధంగా డిజిటల్ అరెస్ట్, పెట్టుబడులు, ట్రేడింగ్, కేవైసీ అప్‌డేట్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, లోన్ యాప్స్, క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేర్లతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే మొదటి గంట అత్యంత కీలకమని, వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయడం లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. తక్షణమే ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసి తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు. అలాగే లోన్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకోవద్దని, బ్యాంకుల ద్వారానే రుణాలు పొందాలని తెలిపారు.

అధిక లాభాల పేరుతో క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెట్టే వ్యక్తులను నమ్మవద్దని, తెలియని వ్యక్తుల సూచనల మేరకు ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో ఇన్‌చార్జ్ సీఈ కోటేశ్వరరావు, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావుగణపురం సీఐ కరుణాకర్ రావు రావు, ఎస్ఐ బొరగల అశోక్ ,కేటీపీపీ అధికారులు, ఉద్యోగులు పోలీసు అధికారులు పాల్గొన్నారు.