మొక్కుబడిగా వంట చేస్తే సహించేది లేదు
* జిల్లా కలెక్టర్ కె. హైమావతి
సిద్దిపేట కలెక్టరేట్,(విజయక్రాంతి): గురుకులాల్లో కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేసి విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం దుబ్బాకలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి బిర్యానీ రైస్ నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మొక్కుబడిగా వంట చేసి విద్యార్థులకు పెడితే సహించేది లేదని హెచ్చరించారు.
వంటగది, స్టోర్‌రూమ్ పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యమైన బియ్యం, కూరగాయలనే వినియోగించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అనారోగ్యానికి గురైన విద్యార్థులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బియ్యం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుతో వెంటనే కలెక్టర్ డీసీఎస్‌వోకు ఫోన్ చేసి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని, గురుకుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.






