8 July, 2026 | 12:53 AM

బకాయి బిల్లుల కోసం.. మూసి ఉన్న బడికి తాళం వేసిన కాంట్రాక్టర్

08-07-2026 12:00 AM

మహబూబాబాద్, జూలై 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం గోపతండ ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు, మన బడి’ కార్యక్రమంలో సుమారు రూ.2 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేయగా, సగం వరకు బిల్లు చెల్లించి మిగిలిన సగం చెల్లించడం లేదని ఆరోపిస్తూ మంగళవారం కాంట్రాక్టర్ ముత్తయ్య దంపతులు మూసి ఉన్న బడికి తాళం వేసి నిరసనకు దిగారు. పనుల కోసం అప్పులు చేయాల్సి వచ్చిందని, ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

పలుమార్లు బకాయి బిల్లుల చెల్లింపు కోసం అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి పరిష్కారం లభించలేదని వాపోయారు. కాలయాపన తప్ప సమస్య పరిష్కారానికి ఎవరూ ముందుకు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరి మార్గంగా పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పాఠశాలకు మంగళవారం స్థానిక పండుగ సందర్భంగా సెలవు ప్రకటించారు. ఎప్పటికీ కాంట్రాక్టర్ మూసి ఉన్న బడికి రెండో తాళం వేయడం చర్చనీయాంశమయ్యింది.