8 July, 2026 | 1:17 AM

జీవోల పేరిట కాలయాపన వద్దు

08-07-2026 12:19 AM
  1. ఫీజు బకాయిలు విడుదల చేయాలి 
  2. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వేముల రామకృష్ణ
  3. తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

ముషీరాబాద్, జులై 7(విజయక్రాంతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నల్ల కండువాలు ధరించి భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 14 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, జీవోలు, కమిటీల పేరిట ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదన్నారు.

ఫీజు బకాయిల విడుదలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, ముఖ్యమంత్రి ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకపోవడంతో అనేక కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో ఉద్యోగావకాశాలు వచ్చినా కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ అమలులో జాప్యం ఎందుకని ప్రశ్నించారు.

ప్రభుత్వం వైఖరి మార్చుకోకపోతే ఈ నెల14న చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. అవసరమైతే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించి14 లక్షల మంది విద్యార్థులను ఏకం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జేఏసీ కో-చైర్మన్ నంద గోపాల్, నరసింహ నాయక్, సానియా, నరేష్, సతీష్, ప్రవీణ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.