21-02-2026 02:11:59 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, ఫిబ్రవరి 20: కల్వకుర్తి పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం మున్సిపల్ చైర్మన్గా బృంగి రత్నమాల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలకి ఊహించని రీతిలో నిధులు మంజూరు చేయించామని, ఇప్పటికే పలు అభివృద్ధి పనులు పురోగమిస్తు న్నాయన్నారు. వ్యాపార సముదాయం నిర్మాణం,
రోడ్ల విస్తరణ, సీసీ రోడ్ల నిర్మా ణం, తాగునీటి సమస్య పరిష్కారానికి పైపులైన్లు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. కల్వకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, రాజకీయ విద్వేషాలకు తావులేకుండా సమన్యాయ పాలన అందించాలని సూచించారు.
పట్టణ అవసరాలపై త్వరలో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసి అవసరమైన నిధులు సమీకరిస్తామని తెలిపారు. ఆదాయ వనరులను పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు చైర్మన్ రత్నమాలతో పాటు వైస్ చైర్మన్ షాన్వాజ్ ఖాన్ ఇతర సభ్యులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్ కుమార్, భూపతి రెడ్డి, సంజీవ్ యాదవ్, భాస్కర్ రెడ్డి, రామ్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, రమాకాంత్, శ్రీకాంత్ రెడ్డి, ఆర్డిఓ జనార్దన్ రెడ్డి, డిఎస్పి వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.