25 August, 2026 | 2:55 AM

రోడ్లు విస్తరించకుండా జంక్షన్ల నిర్మాణం

25-08-2026 12:00 AM

వాహనాల రాకపోకలకు ఆటంకం 

కేసముద్రం, ఆగస్టు 24 (విజయక్రాంతి) : రోడ్లు విస్తరించకుండా కేసముద్రం పట్టణంలో ఇప్పటికే డివైడర్ల నిర్మాణంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ప్రస్తుతం జంక్షన్ల అభివృద్ధి మరింత అసౌకర్యంగా మారింది. పొట్టి శ్రీరాములు సర్కిల్, మహాత్మ జ్యోతిబాపూలే వద్ద రోడ్లు పూర్తిస్థాయిలో విస్తరించకుండానే జంక్షన్ల నిర్మాణం చేపట్టడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తోంది.

కేసముద్రం పట్టణంలో నిత్యం భారీ లారీలు, గ్రానైట్ లారీలు, ఇతర యంత్ర పరికరాలతో వెళ్లే పెద్ద వాహనాలకు జంక్షన్ల వద్ద ఇబ్బందికరంగా మారింది. కేసముద్రం పట్టణ అభివృద్ధిలో భాగంగా ప్రధాన రహదారులను 80 అడుగులకు విస్తరించాలని, బైపాస్ రోడ్డు 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ మేరకు మున్సిపాలిటీ అధికారులు, ఆర్ అండ్ బి శాఖ ఇటీవల పనులను ప్రారంభించారు.

అయితే ప్రధాన రహదారుల్లో పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి మహాత్మ జ్యోతిబాపూలే సర్కిల్ వరకు మాత్రమే ఆర్ అండ్ బి శాఖ రోడ్డు నిర్మాణానికి పెద్దగా ఆటంకం లేకుండా పోయింది. మిగిలిన ప్రధాన రహదారుల్లో పొట్టి శ్రీరాములు సర్కిల్ నుండి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వరకు, ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు, కోరుకొండ పల్లి క్రాస్ రోడ్డు నుండి అంబేద్కర్ సెంటర్ వరకు 80 అడుగుల రోడ్డు విస్తరణ పనులు అనుకున్న విధంగా ముందుకు సాగడం లేదు.

అయినప్పటికీ రోడ్లను విస్తరించకుండా, మధ్యలో డివైడర్లు నిర్మించారు. దీనివల్ల అనేక చోట్ల రోడ్లు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఈ క్రమంలోనే పొట్టి శ్రీరాములు సర్కిల్, మహాత్మ జ్యోతిబాపూలే సర్కిల్ వద్ద నూతనంగా జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న స్థలంలోనే జంక్షన్ల నిర్మాణం కోసం పనులు చేపట్టడంతో రోడ్లు పూర్తిగా ఇరుకుగా మారాయి.

జంక్షన్ ల వద్ద రోడ్ల విస్తరణ కోసం భవనాలను, ఇతర నిర్మాణాలను తొలగించాల్సి ఉంది. అవేవీ చేపట్టకుండానే జంక్షన్ల నిర్మాణం చేపట్టడం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి. రోడ్లకు విస్తరణకు అవసరమైన స్థలం కోసం మార్కింగ్ ఇచ్చామని, షాపులు, గృహాలకు సంబంధించిన యజమానులు సెట్ బ్యాక్ కావాల్సి ఉందని, వారు సెట్ బ్యాక్ కావడంలేదని, అభివృద్ధి పనులను వారి కోసం చేపట్టకుండా నిరూపించే పరిస్థితి లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే రోడ్లను విస్తరించకుండా డివైడర్లు, జంక్షన్ల నిర్మాణం చేపట్టడం వల్ల ప్రస్తుతం వాహనదారులకు, ప్రజలకు అసౌకర్యం కలిగించడం సరికాదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్ల విస్తరణకు చర్యలు చేపట్టి, విస్తరణలో భాగంగా డ్రైనేజీ నిర్మాణం ముందుగా చేపట్టాలని, రోడ్లపై అక్కడక్కడ అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి రోడ్డు పక్కన ఏర్పాటు చేయాలని, వాహనదారులకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసి తారువేయాలని కోరుతున్నారు.