22 July, 2026 | 2:32 AM

హరీశ్‌వన్నీ పచ్చి అబద్ధాలు

22-07-2026 02:02 AM
  1. దేవాదుల పంపులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయి
  2.   22 రిజర్వాయర్లను నింపి తీరుతాం
  3. రైతులు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
  4. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
  5. మీడియా చిట్‌చాట్‌లో వెల్లడి

హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి) : హరీశ్‌రావు చెప్పేవన్నీ అబద్ధాలని, దేవాదుల ఎత్తిపోతల పథకం పంపులు 24 గంటల పాటు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి నుంచి వీలైనంత ఎక్కువ నీటిని ఎత్తిపోసి, దేవాదుల పరిధిలోని తొమ్మిది జిల్లాలకు చెందిన 22 రిజర్వాయర్లను నింపుతామని స్పష్టం చేశారు.

వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా దేవాదుల తొమ్మిది పంపింగ్ యూనిట్‌లను గరిష్ట సామర్థ్యంతో నడపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రైతులు, ప్రజలకు సాగు, తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో చిట్-చాట్  నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టుపై మంత్రుల బృందం నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.

దేవాదుల పంపులన్నింటినీ ఆన్ చేయడం లేదని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అందులో వాస్తవం లేదని మండిపడ్డారు. దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తుందని, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 5.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రజలకు తాగునీటి భద్రత కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.   

బీఆర్‌ఎస్ నిర్ణయాలను వెల్లడించాలి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించాలని మంత్రి డిమాండ్ చేశారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో మొదట రూపొందించిన షీట్ ఫైల్ ఫౌండేషన్ డిజైన్ ఎందుకు మార్చారో హరీశ్‌రావు ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్‌ఎస్ అనాలోచిత నిర్ణయాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు ఈ దుస్థితికి చేరిందన్నారు. 

కాళేశ్వరం కాంట్రాక్టర్లు బీఆర్‌ఎస్‌కు రూ.1,400 కోట్లు చెల్లించారని కవిత చేసిన ఆరోపణలపై హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సన్న వడ్ల టెండర్ల విషయంలో బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని, నిబంధనల మేరకే నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రైతులను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని హితవు పలికారు.