26 April, 2026 | 4:02 AM

అమ్మ పాలనంటే ప్రజలు నవ్వుకుంటున్నారు

26-04-2026 01:09 AM

కవిత పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎద్దేవా 

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టుకునే హక్కు అందరికి ఉందని, కవిత కొత్తగా పార్టీ పెట్టుకోవడం ఎవరికి అభ్యంతరం ఉండదని కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కవిత పార్టీ పెట్టడం చూస్తుంటే ‘చేతులు కాలిన తరవాత ఆకులు పట్టుకున్న’ చందంగా ఉందని ఎద్దేవా చేశారు.

శనివారం మేడిపల్లి సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు జాతిపిత పోయి ఇప్పుడు అమ్మ వచ్చిందని, అమ్మపాలన తీసుకువస్తానని కవితమ్మ చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నా రని తెలిపారు. తెలంగాణ ప్రజలకు అయ్య, అమ్మ పాలన వద్దని, ప్రజాపాలన కావాలనే కాంగ్రెస్‌ను గెలిపించిన విషయం తెలుసుకోవాలన్నారు.

కేసీఆర్, హరీష్‌రావు, కేటీఆర్ అవినీతి, అక్రమాలను బయటపెట్టినందుకు సంతోషమని, కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని తాము మొదటి నుంచి చెబుతున్నామని ఎమ్మెల్యే సత్యం పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్ని పార్టీలు పెట్టినా, ఎవరు పార్టీలు పెట్టినా సీఎం రేవంత్‌రెడ్డి వెంట్రుక కూడా పీకలేరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వంద సీట్లలో విజయం సాధిస్తుందని, మరోమారు సీఎంగా రేవంత్ రెడ్డినే అవుతారని అన్నారు. ఒక వైపు అభివృద్ధి, సంక్షేమంతో పాటు రైతులను ఆదుకోవడం, విద్యా, వైద్యంతో పాటు ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.