26 April, 2026 | 2:23 AM

టీఆర్‌ఎస్‌పై బీఆర్‌ఎస్ సెటైర్లు

26-04-2026 12:45 AM

డూప్లికేట్ పార్టీ అంటూ సోషల్ మీడియా వేదికగా దాడి

రెండు వర్గాల మధ్య డిజిటల్ యుద్ధం

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): కల్వకుంట్ల పార్టీని తెలంగాణ రాష్ట్ర సేన(టీఆర్‌ఎస్)గా ప్రకటించడంతో తెలంగాణ రాజకీ యాల్లో మరోసారి సోషల్ మీడియా వేదికగా వాగ్వాదం తీవ్రంగా రగులుతోంది. కవితకు సంబంధించిన రాజకీయ కార్యకలాపాలపై బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, ఆమె పార్టీని డూప్లికేట్ పార్టీగా అభివర్ణిస్తున్నాయి.

దీంతో రెండు వర్గాల మధ్య డిజిటల్ యుద్ధం ముదురుతోంది. బీఆర్‌ఎస్ నాయకులకు చెందిన అనుచరులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నారు. ముఖ్యంగా పార్టీ గుర్తింపు, కార్యక్రమాలు, రాజకీయ అజెండా ఇవన్నీ అసలు పార్టీకి డూప్లికేట్‌గా ఉన్నాయని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా, కవిత అనుచరులు కూడా ఈ ఆరోపణలను ఖండిస్తూ కౌంటర్ పోస్టులతో స్పందిస్తున్నారు. బీఆర్‌ఎస్ నేతలే అసలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని, కొత్త రాజకీయ ప్రత్యామ్నాయాన్ని చూసి భయపడు తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్, హ్యాష్‌ట్యాగ్ యుద్ధం మరింత ఉధృతమయింది. ఈ పరిణామం కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, భవిష్యత్‌లో ప్రత్యక్ష రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల దృష్ట్యా, ఇలాంటి విమర్శలు, ప్రతివిమర్శలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి, కవిత పార్టీపై డూప్లికేట్ పార్టీ అంటూ వస్తున్న విమర్శలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఈ వివాదం ఎంతవరకు విస్తరిస్తుందో, ప్రజాభిప్రాయాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి మరి!