10 July, 2026 | 2:06 AM

కాంగ్రెస్ అంటేనే రైతు సర్కార్

10-07-2026 12:00 AM
  1. రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం మాదే
  2. రైతు భరోసా కింద 9 రోజుల్లోనే 8,759 కోట్లు జమ
  3. రైతుల ఖాతాల్లోకి మరో రూ.1,900 కోట్లు
  4. చింతకానిలో జరిగే సభను జయప్రదం చేయండి
  5. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఖమ్మం, జూలై 9 (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కార్ అంటేనే రైతు సర్కార్ అని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ర్టంలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాధపురం క్రాస్‌రోడ్ వద్ద శుక్రవారం నిర్వహించనున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు.

అనంతరం లచ్చగూడెం రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు ఆశీర్వాద సభ రాష్ట్ర రైతాంగానికి పండుగ వాతావరణాన్ని తీసుకురానుందని తెలిపారు. సభలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సహచరులు పాల్గొని రైతు భరోసా పథకం కింద చివరి విడతగా రూ.1,900 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవసాయం, అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.72 వేల కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ కేవలం రెండున్నరేళ్లలోనే రూ.35,839 కోట్లను రైతు భరోసా కింద విడుదల చేసిందన్నారు. ఇదే కాలంలో రైతు భరోసా, రుణమాఫీ, పంట బోనస్, పంటల బీమా, పంట నష్టపరిహారం, వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ, వ్యవసాయ యాంత్రీకరణ, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ, సాగునీటి ప్రాజెక్టులు తదితర పథకాల ద్వారా రైతుల కోసం మొత్తం రూ.1,67,877 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు.

రైతు భరోసా కింద రికార్డు స్థాయిలో కేవలం 9 రోజుల్లోనే  రైతులకు రూ.8,759 కోట్లు విడుదల చేశామని భట్టి విక్రమార్క తెలిపారు. రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో రైతుల అకౌంట్లలోకి మరొ రూ.1,900 కోట్లు జమ చేయనున్నట్లు చెప్పారు. దీంతో ఈ సీజన్‌కు గాను కేవలం తొమ్మిది రోజుల్లోనే సంపూర్ణంగా రూ.9 వేల కోట్లు విడుదల చేసినట్లవుతుందని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా వ్యవసాయానికి కేంద్రబిందువుగా నిలిచిందని అన్నారు.

నాగార్జునసాగర్ ఎడమ కాలువతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టుల ఆధారంగా ఈ ప్రాంత ప్రజల జీవనాధారం వ్యవసాయమేనని భట్టి పేర్కొన్నారు. రైతుల కోరిక మేరకే రైతు ఆశీర్వాద సభ అని పేరు పెట్టామని, సభకు మూడు లక్షల మందికి పైగా హాజరవుతారని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని, రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెద్ద సంఖ్యలో సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.