24 March, 2026 | 7:18 AM

ప్రభుత్వ కార్యక్రమాల్లో మమ్మల్ని పట్టించుకోవడం లేదు

24-03-2026 01:01 AM

- అనధికారికంగా రంజాన్ తోఫాలను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు 

- గజ్వేల్ ఆర్డీవో, తహసీల్దార్లకు మున్సిపల్ పాలకవర్గం ఫిర్యాదు

గజ్వేల్, మార్చి 23: ప్రభుత్వ కార్యక్రమాల్లో మమ్మల్ని పట్టించుకోవడం లేదని, అనధికారికంగా రంజాన్ తోఫాలను కౌన్సిలర్లకు సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం ఆర్డీవో చంద్రకళ, ఇన్చార్జి తహసిల్దార్ భాస్కర్లకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, వైస్ చైర్మన్ పద్మా బాయ్ నర్సింగరావు, కౌన్సిలర్లు తమ ఆవేదనను అధికారులకు వెల్లడించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలలో తమకు భాగ స్వాములను చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దాహంతో ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు.

ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలి కానీ ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకోబడిన ప్రతినిధులకు కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు లొంగి అధికారులు వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణమన్నారు. రంజాన్ తోఫాల పంపిణీలో అధికారులు మున్సిపల్ పాలక వర్గాన్ని భాగస్వామ్యం చేసి అందించవలసిన బాధ్యత అధికారులపై ఉన్నా అధికారులు, నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు.

రంజాన్ తోఫాలను నిరుపేద ముస్లింలకు పంపిణీ చేయాల్సి ఉండగా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రంజాన్ తోఫాలను పంపిణీ చేయడం చాలా దారుణమన్నారు. మున్సిపాలిటీలో ముస్లిం పేద ప్రజలు తమకు ప్రభుత్వం నుండి రావలసిన రంజాన్ తోఫాలు అందలేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే పంచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మైనార్టీ ప్రజలకు ప్రభుత్వం నుండి అందవలసిన సంక్షేమ ఫలాలు కేవలం తమ సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రమే పంచుకుంటున్నారనీ పేద మైనార్టీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.

తమకు తెలియకుండా ఏ ఒక్క కార్యక్రమాన్ని చేపట్టరాదని, ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ ని పాటించాలని ప్రోటోకాల్ లేని వ్యక్తులు ప్రభుత్వ పథకాలు ప్రజలకు పంచవద్దని గజ్వేల్ ఆర్డిఓ మరియు ఇన్చార్జి ఎంఆర్‌ఓ గారికి గజ్వేల్ పెట్టినావు మున్సిపాలిటీ పాలకవర్గం వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీనివాస్, మామిడి శ్రీధర్, మురళి, స్వప్న సురేష్, బాబు, మమతా సంతోష్, మమత పోచయ్య, భాగ్యలక్ష్మి, భవాని, తదితరులున్నారు.