24 March, 2026 | 2:30 AM

‘ఫార్ములా ఈ-రేస్’పై ఛార్జిషీట్

24-03-2026 01:00 AM
  1. నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఏసీబీ
  2. కేటీఆర్ ఏ1, అరవింద్ ఏ2గా కేసు

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 23 (విజయక్రాంతి): ఫార్ములా ఈ--కార్ రేస్ వ్యవహారంలో భారీ ఆర్థిక అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ.. సోమవారం నాంపల్లి కోర్టులో ఛార్జిషీటును దాఖలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఆరోపిస్తూ కేటీఆర్‌ను ఏ1 నిందితుడిగా, సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్-ఏ2, బీఎల్‌ఎన్‌రెడ్డి-ఏ3 (హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్), కిరణ్ మల్లేశ్వరరావు-ఏ4 (స్పోర్ట్స్ కన్సల్టెంట్), ఎఫ్‌ఓ-ఏ5 (యునైటెడ్ కింగ్డమ్ కేంద్రంగా పనిచేసే విదేశీ సంస్థ) చార్జిషీటు దాఖలు చేసింది.

కాగా ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ పేరుతో అప్పటి ప్రభుత్వం సుమారు రూ. 55 కోట్ల నిధులను నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థ అయిన ఎఫ్‌ఓ కు మళ్లించినట్లు ఏసీబీ తన ఛార్జిషీటులో వెల్లడించింది.  హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు ఈ లావాదేవీల వెనుక ఉన్న సాంకేతిక, సమన్వయ బాధ్యతలను నిర్వహించారని ఛార్జిషీటులో వివరించారు. ఈ నిధుల మళ్లింపు వెనుక భారీ స్థాయిలో క్విడ్ ప్రో కో జరిగిందన్న అనుమానాలను కూడా ఏసీబీ వ్యక్తం చేస్తోంది.