13 July, 2026 | 12:36 PM

దర్గా స్థలంలో అక్రమ ప్రవేశం..

13-07-2026 11:43 AM

చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు షేక్ షఫియా వినతి

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని సివిల్ లైన్స్ ప్రాంతానికి చెందిన షేక్ షఫియా తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు(Municipal Commissioner) వినతిపత్రం అందజేశారు. తన ఆధీనంలో ఉన్న హజరత్ తాగిద్దీన్ బాబా దర్గా స్థలంలో కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి, కోర్టు ఉత్తర్వులను సైతం పట్టించుకోకుండా వేధింపులకు పాల్పడుతున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. దర్గా స్థలానికి సంబంధించి లక్క రమణ, ముక్తి రాజేష్ తదితరులతో భూ వివాదం కొనసాగుతోందని, ఈ వ్యవహారంపై ఇల్లందు కోర్టులో దాఖలైన ఓ.ఎస్. నెం.34/2025 కేసులో తనకు అనుకూలంగా ఇంజక్షన్ ఉత్తర్వులు వచ్చినప్పటికీ, సంబంధిత వ్యక్తులు వాటిని ధిక్కరించి తరచూ తన స్థలంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని ఆరోపించారు. లక్క రమణ, ముక్తి రాజేష్‌తో పాటు లక్క స్వాతి, లక్క రాంబాయి, లక్క పూర్ణ, లక్క భారతి తదితరులు బండబూతులు తిడుతూ, గుంటలు తవ్వి మురుగునీరు నిల్వ చేయడం, చెత్త వేయడం ద్వారా దర్గా పరిసరాలను మురికిగా మారుస్తున్నారని తెలిపారు.

అంతేకాకుండా తమ ఇంటికి, దర్గా వద్దకు వెళ్లే దారిని అడ్డుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని షేక్ షఫియా ఆరోపించారు. గతంలో ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీంతో వారు మరింత రెచ్చిపోయి తమ కుటుంబ సభ్యులను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్క రమణ ఇంట్లో అద్దెకు ఉంటున్న వారి ఇండ్ల నుంచి వచ్చే మురుగునీటిని కూడా దర్గా ప్రాంతంలోకి వదులుతున్నారని, పెద్ద ఎత్తున మురికిగుంటలు ఏర్పాటు చేసి, చెత్తాచెదారం వేయడం వల్ల దర్గా పరిసరాలు అపరిశుభ్రంగా మారాయని పేర్కొన్నారు. వాటిని శుభ్రం చేయడానికి వెళ్లినా దూషిస్తూ దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వినతిపత్రంలో వివరించారు. సంబంధిత వ్యక్తులను పిలిపించి సమగ్ర విచారణ జరిపి, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని షేక్ షఫియా మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.