calender_icon.png 17 February, 2026 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైర్మన్ పదవికి పోటాపోటీ

16-02-2026 12:25:34 AM

సొంత పార్టీలోనే కుంపటి పోరు

హుస్నాబాద్ లో చైర్మన్ అభ్యర్థి ఓటమి

చేర్యాలలో మాదిగ వర్సెస్ మాల 

గజ్వేల్‌లో పదవి కోసం పాకులాడుతున్న కాంగ్రెస్

దుబ్బాకలో ఉత్కంఠ 

సిద్దిపేట, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో 4 మున్సిపాలిటీలలో చైర్మ న్ పదవికి పోటాపోటీ సాగుతుంది. గజ్వేల్, దుబ్బాక బీసీ మహిళ, హుస్నాబాద్ ఎస్సీ జనరల్, చేర్యాల ఎస్సీ మహిళా రిజర్వేషన్స్ కేటాయించబడ్డాయి. హుస్నాబాద్ లో మా త్రమే కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ మెజారిటీ సా ధించింది. దాంతో ఆ పార్టీ కౌన్సిలర్లు తప్ప మిగతా 3 మున్సిపాలిటీల కౌన్సిలర్లు క్యాం పుకు వెళ్లారు. బిఆర్‌ఎస్ పార్టీ మెజారిటీ స్థా నాలు గెలుపొందడంతో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చైర్మన్ పదవుల కేటాయింపులపై తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిసింది.

చైర్మన్ అభ్యర్థి ఓటమి... 

హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా సిద్దిపేట గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ కేడెం లింగమూర్తిని పార్టీలో ప్రకటించారు. కానీ ఎన్నికల ఫలితాలు ఆశలను తారుమారు చేశాయి. లింగమూర్తి ఓడిపోయారు. దాంతో ఎస్సీ సామాజిక వర్గం నుంచి గెలిచిన మహిళలకు చైర్మన్ పదవి దక్కే అవకాశం లభించింది. 20 వార్డులకు గాను 16 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలవగా 4 వార్డులు బిఆర్‌ఎస్ పార్టీ గెలిచింది.

రాజకీయ ప్రస్థానం ప్రారంభమైనప్పటి నుండి కాంగ్రెస్ లో కొనసాగుతూ పలుమార్లు కౌన్సిలర్ గా ఓటమి చెందిన బూరుగు లత కృష్ణస్వామికి, ఓసారి కౌన్సిలర్ గా పని చేసిన దండి లక్ష్మి కొమురయ్యకు మధ్య చైర్మన్ పోటీ తీవ్రతరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సావుల మంజుల కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులు ఎవరికి ఉంటే వారే హుస్నాబాద్ చైర్మన్ అవుతారని చర్చ జరుగుతుంది. ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటీని వారే నిర్ణయించుకోవాలని లేదంటే తాను సూచించిన వారికి చైర్మన్ పదవి ఇవ్వాల్సి వస్తుందంటూ బహిరంగంగానే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించినట్లు తెలిసింది. 

మాదిగ వర్సెస్ మాల... 

చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 7 వార్డులు బిఆర్‌ఎస్, 5 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. బిఆర్‌ఎస్ పార్టీలో ఇద్దరు ఎస్సీ మహిళలు గెలుపొందారు. ముత్యాల అరుణ ఇదివరకు చేర్యాల సర్పంచిగా కొనసాగారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికలలో ఆమె పోటీ చేయలేదు ఈసారి అవకాశం రావడంతో పోటీ చేసి గెలుపొందారు. కమలాపురం గీతాంజలి రాజకీయ ప్రవేశం చేసి మొదటిసారి కౌన్సిలర్ గా గెలిచారు. అయితే ముత్యాల అరుణ ఇదివరకు సర్పంచ్ గా కొనసాగారని ఇప్పుడు మాల వర్గానికి చెందిన గీతాంజలి కి చైర్మన్ అవకాశం ఇవ్వాలంటూ ఆ వర్గం రాజకీయ నాయకులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. చేర్యాల మున్సిపాలిటీ చైర్మన్ పదవి మాదిగ వర్సెస్ మాల కోణంలో పోటీ కొనసాగుతుంది. 

దుబ్బాక మున్సిపాలిటీలో..

 11 మంది గెలిచిన బిఆర్‌ఎస్ పార్టీ చైర్మన్ పదవి దక్కించుకుంటుంది. ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లను బిఆర్‌ఎస్ పార్టీ చేర్చుకోవడంతో ఆ పార్టీకి పూర్తి మెజార్టీ లభించింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 4, బిజెపి ఇద్దరు చొప్పున గెలిచారు. బిఆర్‌ఎస్ పార్టీలోనే సొంతకుంపటి ఏర్పడి చైర్మన్ పదవికి భలే డిమాండ్ పలుకుతుందని తీవ్రంగా చర్చ జరుగుతుంది. బండి శ్రీలేఖ, శ్రీరామ్ సంగీతల మధ్య చైర్మన్ పీఠం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆశీస్సులు ఎవరికి ఉంటే వారే చైర్మన్ అవుతారని ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. 

మున్సిపల్ కార్యాలయానికి కేసీఆర్.. 

సోమవారం గజ్వేల్ మున్సిపాలిటీకి మాజీ సీఎం కేసీఆర్ రారున్నారు. మున్సిపల్ చైర్మన్ పదవికి ఎక్స్ అఫీషియో ఓట్లు తప్పనిసరి కావడంతో ఆయన ఓటు తో మద్దతు తెలిపేందుకు మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 20 వార్డులకు గాను బిఆర్‌ఎస్ 11, కాంగ్రెస్ 7, బిజెపి 1, ఇండిపెండెంట్ ఒకరు చొప్పున గెలుపొందారు. అయితే కాంగ్రెస్ కూడా ఇక్కడ చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు తీవ్రంగా కృషి చేస్తుందని తెలిసింది. 

గెలిచిన కౌన్సిలర్లు అందరూ క్యాంపుకు వెళ్ళగా కాంగ్రెస్ పరోక్షంగా ప్రయత్నాలు కొనసాగిస్తుందని అందుకే రంగంలోకి కేసిఆర్ వస్తున్నట్లు సమాచారం. ముంపు గ్రామాల కౌన్సిలర్ కి చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ఆ గ్రామాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అన్ని సమస్యలను సద్దుమణిగించాలంటే కెసిఆర్ ప్రత్యక్షంగా కనబడాలని పార్టీ ముఖ్యులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇద్దరి మధ్యనే చైర్మన్ పదవికి పోటీ కొనసాగుతుంది.