ప్రాణాలు తీసిన ప్రమాదాలు!
* కుటుంబాలు చిన్నాభిన్నం
* అతివేగమే కారణం
మహబూబాబాద్, మే 20 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన పలువురి ప్రాణాలను వరస రోడ్డు ప్రమాదాలు కబళించాయి. ఇందులో ప్రధానంగా జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మరణించగా, వరంగల్ జిల్లా నర్సంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. ఇక మంగళవారం రాత్రి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలవడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది.
ఓవైపు పోలీసులు రోడ్డు భద్రతపై అనేక చర్యలు తీసుకుంటూ, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ వల్ల కనీసం ప్రాణాపాయం తప్పుతుందని విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఆయా సంఘటనల్లో నిర్లక్ష్యంగా వాహనాలు నడపడమే ప్రమాదానికి హేతువుగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.
రోడ్డు రవాణా భద్రతా చర్యలను పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం, ప్రమాదా లు జరిగిన తర్వాత ప్రాణాలు కోల్పోయి, కుటుంబాలు చిన్నాభిన్నం కావడం ఇటీవల పరిపాటిగా మారిందరే విమర్శలు వస్తున్నాయి. ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా చర్యలను పాటించడం లేదని విమర్శలు అనేక ప్రమాద ఘటనల్లో వెలుగుచూస్తున్నాయి. దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా, సామర్ధ్యానికి మించి మనుషులను తీసుకువెళ్లడం వల్ల కూడా ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి.
వాణిజ్య వాహనాల్లో ప్రజా రవాణా చేయడం, కార్లు, ఆటోలు, జీపుల్లో సామర్థ్యానికి మించి రవాణా చేయడం, ట్రాక్టర్లు లారీలు, డీసీఎం వ్యాన్లలో ప్రజలను తీసుకెళ్లడం, ప్రమాదాలు జరిగిన తర్వాత ఆయా కుటుంబాలకు జరిగే నష్టాన్ని ఎవరు కూడా పూడ్చలేని పరిస్థితి లేకుండా పోతోంది. తాము నడిపే వాహనాలకు ముందుగా సరైన రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు లేకపోవడం, ఇన్సూరెన్స్ చేయించకపోవడం, ఇతర పొల్యూషన్, ఫిట్నెస్, తదితర ధ్రువ పత్రాలను కలిగి ఉండకపోవడం వల్ల రోడ్డు ప్రమాద ఘటనలో మరణించిన కుటుంబాలకు పరిహారం పొందడం, ప్రమాద నష్టానికి ఇన్సూరెన్స్ సంస్థల నుండి బీమా క్లెయిమ్ చేయలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే అనేక సంఘటనల్లో ప్రమాద ఘటనల్లో సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే వాహనాలు నడిపి ప్రమాదానికి కారకలవుతున్నారు. ఫలితంగా ప్రమాదానికి కారణమైన వాహన యజమాని లేదంటే డ్రైవర్ నుండి పరిహారాన్ని రాబట్టడానికి ఆందోళనలు నిర్వహించడం ఇటీవల నిత్య కృత్యంగా మారిందని ఆరోపణలు వస్తున్నాయి.ప్రతి వాహనదారుడు ముందుగా చెల్లుబాటులో ఉండే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం, తాను నడిపే వాహనానికి సరైన రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ పత్రాలను కలిగి ఉండాలి.
నిబంధనల ప్రకారం ద్విచక్ర వాహనంపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాల్సి ఉండగా, ముగ్గు రు నలుగురు వీలైతే ఐదుగురు కూడా ప్రయాణిస్తున్నారు. దీనికి తోడు మైనర్లు వాహనాలను నడపడంతో పాటు రాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీన్ని నివారించాల్సిన తల్లిదండ్రులే కొన్నిసార్లు ప్రోత్సహించడం ప్రమాదాలకు కారణంగా మారుతోంది.
పోలీసులు తనిఖీలు చేసినప్పుడు పట్టుబడితే వారికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది పోయి, వెనకేసుకు రావడం, వీలైతే పైరవీ ద్వారా వాహనాలను విడిపించుకు వెళుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఇప్పటివరకుపట్టణాలకే పరిమితమైన రాష్ డ్రైవింగ్ పల్లెలకు కూడా పాకింది. ఇటీవల జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో యువకులు దుర్మరణం పాలవడం, అతివేగమే ఇందుకు కారణమనే విమర్శలు వస్తున్నాయి.
పోలీసులు ఎంత చెప్పినా.. కొందరు నిర్లక్ష్యం చూపుతూ, రోడ్డు భద్రతా చర్యలను విస్మరిస్తూ, ప్రమాదాలకు గురవుతూ, అవతలి వైపు వారు ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ వారి ప్రాణాలను లేదంటే తీవ్రంగా గాయపరచడం లాంటి ఘటనలకు కారణం అవుతున్నారు. ఇప్పటికైనా రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించడం తోపాటు, రోడ్డు భద్రతా చర్యలను తప్పనిసరిగా పాటించడం, అతివేగంగా వాహనాలు నడిపే విధానాన్ని తగ్గించడం లాంటి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






