22 August, 2026 | 4:12 PM

పట్టుపరిశ్రమతో రైతులకు అదనపు ఆదాయం

22-08-2026 03:19 PM

హుజూరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి)మేరా రేషమ్ మేరా అభిమాన్ (MRMA) 2.0 ప్రచార కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని సింగాపూర్ గ్రామ రైతు వేదికలో శనివారం పట్టు పరిశ్రమను లాభదాయకమైన వృత్తిగా చేపట్టడం అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. . కేంద్ర పట్టు పరిశ్రమ బోర్డు శాస్త్రవేత్త-డి డా. గులాబ్ ఖాన్, జిల్లా పట్టు పరిశ్రమ శాఖ నోడల్ అధికారి బానోతు వెంకన్న రైతులకు పట్టు పరిశ్రమలోని అవకాశాలను వివరించారు. అధిక దిగుబడినిచ్చే మల్బరీ రకాలైన AGB-8, G2, G4, S-134, అలాగే TT21 × TT54, MV1 × S8 పట్టు పురుగు సంకర జాతుల గురించి అవగాహన కల్పించారు. శాస్త్రీయ పద్ధతుల్లో మల్బరీ సాగు, పట్టు పురుగుల పెంపకం చేపట్టడం ద్వారా కోకూన్ దిగుబడిని, రైతుల ఆదాయాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. పట్టు పరిశ్రమకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ రాయితీలు, పథకాలు, సహాయ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని నోడల్ అధికారి వెంకన్న సూచించారు. రైతులు ఇప్పటికే సాగు చేస్తున్న పంటలతో పాటు పట్టు పరిశ్రమను సమగ్ర వ్యవసాయ విధానంలో భాగంగా చేపట్టి కుటుంబ శ్రమ, వ్యవసాయ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో ATMA డైరెక్టర్ చత్రు నాయక్, వ్యవసాయ శాస్త్రవేత్త, అగ్రోనమిస్ట్ డా. మధుకర్ రావు, సహాయ వ్యవసాయ సంచాలకులు జి. సునీత, వ్యవసాయ అధికారి భూమిరెడ్డి, సింగాపూర్ AEO సౌమ్య, ATMA వనరుల వ్యక్తి స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.