22 August, 2026 | 3:45 PM

అమీన్ పూర్ ను అభివృద్ధికి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

22-08-2026 03:12 PM

రూ.8.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

అమీన్ పూర్, ఆగస్టు 22(విజయక్రాంతి): అమీన్ పూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీని ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో ఆదర్శ కాలనీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, కాలనీల్లో నెలకొన్న ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తాము, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమన్వయంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. శనివారం అమీన్ పూర్ డివిజన్ పరిధిలోని రాజేంద్ర రెడ్డి కాలనీ, సాయి అంబిక కాలనీ, పిఎన్ఆర్ కాలనీ, నరేంద్ర నగర్ కాలనీ, సాయిరామ్ ఎంక్లేవ్, శంకర్ గ్రీన్ హోమ్స్, బృందావన్ టీచర్స్ కాలనీ, నవ్య నందనవనం కాలనీ, నర్రేగూడెం రాజీవ్ గృహకల్ప కాలనీలలో పర్యటించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మొత్తం రూ. 8.19 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగు నీటి కాలువల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో ప్రజలు, సంక్షేమ సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్యే నేరుగా సమావేశమై స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సీసీ రోడ్లు, యూజీడీ, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్,  మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, డిఈ వెంకటరమణ, ఎంఈఓ రాథోడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.