22 August, 2026 | 2:18 PM

నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి

22-08-2026 01:55 PM

ఏప్రిల్ 2027 నాటికి ఐటీ టవర్ నిర్మాణం పూర్తి చేయాలి

నాణ్యతలో రాజీ వద్దు.. పనుల్లో వేగం పెంచాలి

వనపర్తి, (విజయక్రాంతి): జిల్లాలో నాగవరం వద్ద రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ.22 కోట్లతో నిర్మిస్తున్న నూతన ఐటీ టవర్ భవన నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం ఉదయం నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న భవన పనులను పరిశీలించిన కలెక్టర్.. పూర్తయిన తర్వాత ఐటీ టవర్ రూపురేఖలు, అంతస్తులు, ఎలివేషన్ తదితర అంశాలను ఇంజినీరింగ్ అధికారులను చిత్రపటాల ద్వారా అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి ఏప్రిల్ 2027 నాటికి భవనాన్ని పూర్తి చేసి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.

ఏప్రిల్ 2026లో ప్రతాప్‌రెడ్డి కొండా ఏజెన్సీతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఏడాది వ్యవధిలో నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. గడువులోగా పనులు పూర్తయ్యేలా రోజువారీ, వారంవారీ పనుల పురోగతికి సంబంధించిన గ్రాఫ్‌ చార్ట్ రూపొందించి అందించాలని కలెక్టర్ సూచించారు. చార్ట్ ప్రకారం నిర్ణీత సమయానికి పనులు జరుగుతున్నాయా లేదా అన్నది నిరంతరం పరిశీలిస్తామని స్పష్టం చేశారు. నిర్మాణానికి అవసరమైన ఇసుక, గ్రావెల్ తదితర సామగ్రి విషయంలో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. సామగ్రి లభ్యతలో ఇబ్బందులను సాకుగా చూపి నిర్మాణ పనులను నిలిపివేయవద్దని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట జోనల్ మేనేజర్ జ్యోతి, డీఈ సుబ్బారావు, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, కాంట్రాక్టర్ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.