26 August, 2026 | 2:03 PM

మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం

26-08-2026 12:09 PM

కేసీఆర్ పాలనలోనే మహిళా సంక్షేమానికి పెద్దపీట

ఖమ్మం,ఆగస్టు26,(విజయక్రాంతి): మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళకు సమాన హక్కులు, సమాన అవకాశాలు, సమాన గౌరవం దక్కే సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. మహిళా సమానత్వం అనేది కేవలం ఒక నినాదంగా కాకుండా ఆచరణలో కనిపించాల్సిన అంశమన్నారు. మహిళల సాధికారతతోనే ప్రతి కుటుంబం,సమాజం మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం అనేక పథకాలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో విఫలమైందని పువ్వాడ విమర్శించారు.

మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాటలకే పరిమితం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని ఆరోపించారు. మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తామని, కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తామని, యువతులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తామని కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని, హామీల అమలులో స్పష్టత లేకపోవడం, పూర్తిగా విస్మరించిన నేపథ్యంలో మహిళలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని తెలిపారు. గతంలో మహిళల సంక్షేమం, భద్రత, ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. మహిళలకు కేవలం పథకాలు ప్రకటించడం కాకుండా వాటిని సమర్థవంతంగా అమలు చేసి, వారి జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.