3 September, 2026 | 3:02 AM

ఆరు గ్యారంటీలు.. 420 హామీలు ఏమయ్యాయి?

03-09-2026 | 12:38am
  1. కాంగ్రెస్ 420 హామీలకు ‘బాకీ కార్డు’!
  2. వెయ్యి రోజులు గడిచినా హామీల అమలేది?
  3. మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి
  4. వెయ్యి రోజుల పాలనలో పూర్తిగా విఫలం..
  5. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

మెదక్/నర్సాపూర్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మాదేవేందర్రెడ్డి(Former Deputy Speaker M. Padma Devender Reddy) తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు మెదక్ హెడ్ పోస్టాఫీసు వద్ద అంబేద్కర్ చౌరస్తా నుంచి రాందాస్ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అమలు కానీ హామీలు 420 అడుగుల పొడవైన ఫ్లెక్సీతో భారీ ప్రదర్శన నిర్వహిం చారు. అనంతరం ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 33 నెలలు, దాదాపు వెయ్యి రోజులు పూర్తవుతున్నా ఆరు గ్యారంటీలు, 420 హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజలకు ఎంత బాకీ ఉందో లెక్కలతో వివరించేందుకే ‘బాకీ కార్డులు’ పంపిణీ చేస్తు న్నామని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ శేరి. సుభాష్రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

రైతులకు రుణమాఫీ సక్రమంగా జరగలేదని, రైతుబంధు, రైతుబీమా విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ నాయకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆరేళ్ల.మల్లికార్జున్ గౌడ్,బట్టి జగపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు ఆకిరెడ్డి కృష్ణ రెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ళ.

ఆంజనేయులు కౌన్సిలర్లు జుబేర్ అహ్మద్ దీపక్, కుమార్ సోహెల్, హవెలిఘనపూర్, శంకరంపేట్ ఆర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి, పట్లోరి. రాజు, రామాయంపేట రామాయంపేట మాజీ ఎంపీపీ పుట్టి.విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా.నరేందర్, మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నర్సాపూర్ లో

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీ, రైతుబీమా, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, పింఛన్దారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. కాంగ్రెస్ పాలనకు నిరసనగా నర్సాపూర్లో ఆమె ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని సునీత లక్ష్మారెడ్డి తెలిపారు.