హామీల అమలులో కాంగ్రెస్ దారుణ వైఫల్యం
- 100 రోజులన్నారు, 1000 రోజులు అయ్యింది
- ఏడు రోజుల పోరు బాటను విజయవంతం చేయండి
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- కాంగ్రెస్ 420 హామీల అమలుకు బీఆర్‌ఎస్ పోరుబాట
- తొలి రోజు ఇంటింటికి బాకీ కార్డుల పంపిణీ, 420 హామీల ఫ్లెక్సీ ప్రదర్శన
పటాన్‌చెరు, సెప్టెంబర్ 2: 420 హామీల పేరుతో అరచేతిలో స్వర్గం చూపించి అందలమెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్న హామీల అమలులో ఘోరంగా విఫలం కావడంతోపాటు విధ్వంస పాలన కొనసాగిస్తుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) విమర్శించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల దగా పాలన నిరసిస్తూ బిఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన వారం రోజుల పోరుబాట కార్యక్రమంలో భాగంగా తొలి రోజు పటాన్ చెరు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేతృతంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎంజీ రోడ్డు నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఫ్లెక్సీ ప్రదర్శన, నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రజలకు బాకీ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో పాలన సాగిస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. తొంభైవ దశకం నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇంత దారుణమైన, దరిద్రమైన పరిపాలనను తాను చూడలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన 420 హామీలను ప్రజలకు ఇచ్చిన మాటగా భావించి వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.






