calender_icon.png 5 February, 2026 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ కమీషన్‌రాజ్

05-02-2026 01:41:16 AM

  1. తెలంగాణలో ఆర్‌ఆర్ టాక్స్ 
  2. కొన్ని వర్గాలకే కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం
  3. రాష్ట్రంలో సనాతన ధర్మంపై దాడి 
  4. బీజేపీతోనే సబ్బండ వర్గాల సంక్షేమం
  5. పాలమూరులో విజయసంకల్ప సమ్మేళనంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 
  6. పాలమూరు బీజేపీకి అడ్డ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్‌ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా ఆరోపించారు. కాంగ్రెస్ కమీషన్‌రాజ్ అని, - కొన్ని వర్గాలకే ఆ పార్టీ ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో సనాతన ధర్మంపై దాడి జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించు కోవడం లేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో బుధవారం ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

మొదటగా తెలంగాణ పుణ్య భూమి అని, తెలంగాణ విమోచనం కోసం ప్రాణాలు అర్పించిన వారికి నివాళి అర్పించారు. తెలంగాణకు నిజాం నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విముక్తి కల్పించారని అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డి కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. ముస్లిం అంటే కాంగ్రెస్ అనే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మైనార్టీలకే ప్రాధాన్యత ఇస్తుందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యతలో నిధులను తగ్గిస్తుందని ఆరోపించారు. వక్ఫ్ బోర్డులో జరుగుతున్న అక్రమాలను తొలగించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తే, కాంగ్రె స్ పార్టీ ఏ విధంగా అడ్డుకుందో ప్రజలకు తెలుసన్నారు. ఈ చట్టం ద్వారా తెలంగాణలో వేలకోట్ల విలువ చేసే సుమారు 75 వేల ఎకరాల భూమిని కాపాడామని చెప్పా రు.

రాష్ట్రంలో చాలా చోట్ల హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నోరు మెదపడం లేదని  పేర్కొన్నారు. హిందూ సనాతన ధర్మంపై ఎంత పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదన్నారు. సనాతన ధర్మం భారత దేశానికి ఆత్మలాంటిదని, అలాంటి ధర్మంపై దాడి జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్ ప్రభుత్వానికి హిందూవాదు లు, సనాతన ధర్మాన్ని పాటించేవారు బుద్ధి చెప్పాలని సూచించారు. 

మహిళలకు కాంగ్రెస్ అన్యాయం..

కేంద్రం మహిళలకు దేశవ్యాప్తంగా సమాన అవకాశాలు కల్పించాలని నారీశక్తి పేరుతో అనేక పథకాలు ప్రారంభించిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని నబీన్ సిన్హా విమర్శించారు. గతంలో తెలంగాణను 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్‌ఎస్ కూడా ఇదే చేసిందన్నారు. కాంగ్రెస్ మహిళలకు చేస్తున్న అన్యాయాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం మహిళలకు అమలు చేస్తున్న పథకాలను వివరించాలని పిలుపునిచ్చారు.

మహిళలే కాదు రైతులు, ఎస్సీ ఎస్టీ, బీసీ వర్గాలకు  కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని వివరించాలన్నారు. రైతు భరోసా పేరుతో రూ.పది వేలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని, రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదని, భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున హామీని విస్మరించారని చెప్పారు. సబ్బండావర్గాల సంక్షేమం కేవలం బీజేపీతోనే సాధ్యం అవుతుందని స్పష్టం చేశారు. కమీషన్ల ప్రభుత్వానికి ముగింపు పలకాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు. 

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం..

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ కేటాయింపులు జరిపిందని, గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే శాఖకు రూ.5,454 కోట్లు కేటాయించిందని నబీన్ సిన్హా చెప్పారు. దేశం మొత్తంలో ఏడు హైస్పీడ్ రైల్వే కారిడార్లను ఏర్పాటు చేయగా అందులో తెలంగాణకే మూడు కేటాయించి  తమకున్న అభిమానాన్ని చాటుకున్నారని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు, మెగా టెక్స్‌టైల్, హైదరాబాద్ కారిడార్, హైదరాబాద్ టు వరంగల్ రెండు ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు చేస్తున్నదన్నారు.

ఇంత పెద్ద మొత్తం లో అభివృద్ధి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి  బిజెపికి తెలంగాణ ప్రజలు అండగా నిలవాలని కోరారు. యూరోపియన్ దేశాలతో భారత ప్రభుత్వం అత్యంత సాన్నిహిత సంబంధాలు కొనసాగుతూ దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తుందని, అమెరికా సైతం అత్యధికంగా ఆంక్షలు విధించినప్పటికి ఇవాళ భారతదేశానికి తలకి  టారీఫ్ 18% శాతానికి తగ్గించిం దంటే దాని వెనక మోదీ చేసిన కృషి ఎంతో ఉన్నదన్నారు.

ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు కేవలం ఓట్ల కోసమో, పార్టీ కోసమో కాదని తెలంగాణ భవిష్యత్తు కోసం జరిగే ఎన్నికలని, బీజేపీకి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఐదవ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారు, శ్రీశైలం ఉత్తర ద్వారం గా ఉన్న ఉమా మహేశ్వర క్షేత్రం ఈ ప్రాంత ప్రత్యేకతను చాటుతున్నదని వివరించారు.

పాలమూరు బీజేపీకి అడ్డా: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

పాలమూరు గడ్డ బీజేపీకి అడ్డగా ఎల్లప్పుడూ ఉంటుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇక్కడి నుంచే రాష్ట్ర సాధన కోసం యాత్ర నిర్వహించామని, కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని స్పష్టం చేశారు. పాలమూరు పార్లమెంటు సీటును రెండుసార్లు గెలిపించుకున్నామని తెలిపారు. నారాయణపేట, మక్తల్ మున్సిపాలిటీలలో మున్సిపల్ చైర్మన్‌గా బీజేపీ గెలిచిందన్నారు. మహబూబ్‌నగర్, వనపర్తిలో కూడా మున్సిపల్ వైస్ చైర్మన్‌గా బీజేపీ జెండా ఎగిరిందన్నారు.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో 2012 సంవత్సరంలో ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినప్పటికీ ఇక్కడ బీజేపీ ఎంపీ గెలిచారన్నారు. అందరికీ సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. రేవంత్‌రెడ్డి మాటలు కోటలు దాటుతాయని, పనులు పాలమూరు జిల్లాకు రావన్నారు.

కేసీఆర్‌కు రాహుల్‌గాంధీకి ఒప్పందాలు కుదిరిపోయాయని ఎప్పుడూ ఎవరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత ఒక డీఎస్పీని సీఐగా డెమోషన్ చేశారని, ఇది ఒక్కటే జరిగిందన్నారు.   రైల్వే కారిడార్ ఏర్పాటు కోసం కేంద్రం పాలమూరు జిల్లాలో రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. 

నితిన్ నబీన్‌కు ఘన స్వాగతం

హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా బుధవారం మధ్యాహ్నం బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మహబూబ్ నగర్ సభకు హాజరయ్యేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి వెళ్లారు.

నితిన్ నబీన్‌ను కలిసి స్వాగతం పలికిన వారిలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు, కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టరు కే లక్ష్మణ్, బీజేపీ శాసనమండలి పక్ష నేత ఏవీఎన్‌రెడ్డి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం, పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్, బీజేపీ కర్ణాటక, తమిళనాడు కో-ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బీజేపీ మున్సిపల్‌కార్పొరేషన్ ఎన్నికల సహ ఇన్‌చార్జులు అశోక్ పర్ణామి, రేఖాశర్మ తదితర నాయకులు ఉన్నారు.

సీఎంవి మత రాజకీయాలు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 

సీఎం రేవంత్‌రెడ్డి మత రాజకీయాలు చేస్తున్నార ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అంటే నే ముస్లిం, అంటేనే కాం గ్రెస్ అని అన్నది సీఎం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాలయాల ను కూలగొడుతున్నా కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి అహంకారం పెరిగిందని, 90 శాతం మున్సిపాలిటీలను గెలుస్తాను అన్నాడని, బీఆర్‌ఎస్ కూడా గతంలో ఇలాగే చెప్పి నామరూపాలు లేకుండా పోయిందని, గత పార్లమెంట్ ఎన్నికల్లో కారు.. సర్కారు.. 16 అని కనీసం ఒక్క సీటు కూడా బీఆర్‌ఎస్‌కు దక్కలేదన్నారు.  

బీజేపీ వైపు ప్రజల చూపు: ఎంపీ డీకే అరుణ 

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. గ్రామాలు, పట్టణాలు అనే బేధం లేకుండా అన్ని ప్రాంతాలు సమాంతరంగా అభివృద్ధి చెందినప్పుడే పికాసి భారత లక్ష్యం నెరవేరుతుందని పీఎం నరేంద్ర మోదీ చెప్పారని గుర్తు చేశారు. మున్సిపాలిటీలకు అమృత్ స్కీం ద్వారా, గ్రామాలకు 14, 15 ఫైనాన్స్ ద్వారా ప్రత్యేక నిధులను సమకూర్చుతుందని స్పష్టం చేశారు.

గత పది పన్నెండేళ్ల నుంచి  మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులు ద్వారానే జరుగుతుందని తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన రైల్వే స్టేషన్ల ను సైతం ఆధునికరిస్తున్నామని, ఎయిర్‌పోర్టులకు దీటుగా రైల్వే స్టేషన్లను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు.