08-02-2026 12:06:07 AM
కాంగ్రెస్ అభ్యర్థి సాత ప్రవీణ్ కుమార్
శంకర్‌పల్లి 15వ వార్డులో అభ్యర్థి ముమ్మర ప్రచారం
శంకర్‌పల్లి, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): శంకర్‌పల్లి మున్సిపాలిటీ 15వ వార్డు ప్రజ లు తనను ఆదరించి గెలిపిస్తే.. అయ్యప్ప రెడ్డి గూడ, సాయి నగర్ కాలనీల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాత ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చా రు. శనివారం ఆయన 15వ వార్డు పరిధిలోని అయ్యప్ప రెడ్డి గూడ, సాయి నగర్, పోలీస్ క్వార్టర్స్ ప్రాంతాలలో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సహకారంతో వార్డుకు అధిక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల వంటి పథకాలు కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమని, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. తన సతీమణి సాత విజయలక్ష్మి మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న సమయంలోనే అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు పెద్దపీట వేసినట్లు గుర్తు చేశారు.
గత 20 ఏళ్లుగా సామాజిక కార్యక్రమాల్లో ఉన్నానని.. కరోనా కష్టకాలంలో నిత్యవసరాల పంపిణీ, వేసవిలో సొంత ట్యాంకర్లతో ఉచిత మంచినీటి సరఫరా, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసినట్లు వివరించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులతో అభివృద్ధి కుంటుపడుతుందని, కాంగ్రెస్‌ని గెలిపిస్తే వార్డు ప్రగతి సాధ్యమని ఓటర్లను అభ్యర్థించారు.గతంలో చేసిన అభివృద్ధి పనులే నన్ను గెలిపిస్తాయని నమ్ముతున్నా ను. రెండోసారి అవకాశం ఇస్తే మిగిలిపోయి న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు.ప్రచార కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సాత విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాశెట్టి మోహన్, నాయకులు గోపాల్ రెడ్డి, అనంతరెడ్డి పాల్గొన్నారు.