రోడ్డు ఆక్రమణపై కలెక్టర్‌కు ఫిర్యాదు
కరీంనగర్, మార్చి 5 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలో ప్రజా రహదారులపై జరుగుతున్న ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ కు మాజీ కార్పొరేటర్, న్యాయవాది ఎ.వి. రమణ ఫిర్యాదు చేశారు. 12వ డివిజన్ కు చెందిన కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ కుటుంబ సభ్యులపై రాంచంద్రాపూర్ కాలనీలో 20 ఫీట్ల రోడ్డుకు సంబంధించిన ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయని, ఈ విషయమై ఇప్పటికే నగరపాలక సంస్థ కమిషనర్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని తెలిపారు.
మాజీ మేయర్, ప్రస్తుత డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు పూర్వ కార్యాలయం భగత్ నగర్లో 30 ఫీట్ల రోడ్డుపై నిర్మాణమైందనే అంశంపై కూడా విచారణ అవసరమని తన ఫిర్యాదులో ప్రస్తావించినట్లు తెలిపారు. ఆ భవనానికి ఇంటి నెంబర్ 9-1-211/A/2 కేటాయించబడిందని, గతంలో అది కార్పొరేటర్ కార్యాలయంగా వినియోగించబడిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు.
ప్రజలకు ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధిని అందించాల్సిన బాధ్యత గల ప్రజాప్రతినిధులపై రోడ్డు ఆక్రమణలకు సంబంధించిన తీవ్రమైన ఆరోపణలు రావడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ స్వయంగా చొరవ తీసుకొని సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన తన వినతిపత్రంలో కోరారు.




