విద్యార్థులకు ప్రాథమిక చదువు నైపుణ్యాలు తప్పనిసరిగా నేర్పించాలి
కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల, మార్చి 5 (విజయ క్రాంతి): విద్యార్థులకు ప్రాథమిక చదవు నైపుణ్యాలు తప్పనిసరిగా నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అన్నారు. గురువారం మెట్ పెల్లి లోని ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థుల చదువుతున్న తీరును స్వయంగా పరీక్షించి 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి సరిగా చదవలేకపోవడం గమనించి ప్రధానోపాధ్యాయురాలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కనీస ప్రాథమిక చదవు నైపుణ్యాలు కూడా రాకపోవడం ఆందోళనకరమని పేర్కొంటూ ప్రధానోపాధ్యాయురాలిని ప్రశ్నించారు.
పాఠశాలలో ప్రతి విద్యార్థికి సరైన విధంగా చదవడం నేర్పించే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ 30 రోజులలోగా ప్రతి విద్యార్థికి కనీసం చదవడం రావాలని లేకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోసారి సారి పాఠశాల సదర్శించే లోపు పరిస్థితి మెరుగుపడకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో పనిచేసి బోధనలో నాణ్యతను పెంచాలని, ప్రతి విద్యార్థి చదువులో ముందుకు రావడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వెల్ఫేర్ రాజ్ కుమార్, విద్యాశాఖ జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.




