12 May, 2026 | 2:26 AM

నాలాలు, బఫర్‌జోన్ ఆక్రమణపై ఫిర్యాదు

12-05-2026 12:28 AM

ఘట్ కేసర్, మే 11 (విజయక్రాంతి) : అక్రమంగా ప్రభుత్వ చెక్ డ్యామ్ లో మట్టిని నింపుతూ నాళాలు, బఫర్ జోన్ కబ్జా చేస్తూ జరుగుతున్న ఆక్రమణపై విచారణ జరిపించి తక్షణమే చర్యలు తీసుకోవలసిందిగా ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ఫిర్యాదును అందజేశారు.  మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, జి.హెచ్.ఎం.సి పరిధిలోని పోచారం డివిజన్ (8వ వార్డు), ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలో యంనంపేట్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్లు 153, 154లో సుమారు 10 ఎకరాల భూమిని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కొనుగోలు చేసి అపార్టుమెంట్ల నిర్మాణ పనులు చేపడుతోంది.

ఈ నిర్మాణాల సమీపంలో ఉన్న బొంతకుంట వాగుపై ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యామ్ ఉంది. అయితే, సదరు సంస్థ నిర్వాహకులు జెసిబిల సహాయంతో వాగులోని బురద మట్టిని తొలగించి, టిప్పర్ల ద్వారా ఎర్రమట్టి, మోరంను చెక్ డ్యామ్ లో నింపుతూ దాని విస్తీర్ణాన్ని తగ్గిస్తూ క్రమంగా పూడ్చివేస్తున్నారు. భవిష్యత్తులో భారీ వర్షాలు లేదా వరదలు సంభవించినప్పుడు చెక్ డ్యామ్ బలహీనపడే అవకాశం ఉంది లేదా విరిగిపోయే ప్రమాదం ఉంది.

అటువంటి పరిస్థితి ఏర్పడితే ముందుగా యంనంపేట్ ఈడబ్ల్యూ ఎస్ కాలనీవాసుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా మట్టిని నింపడం ద్వారా చెక్ డ్యామ్ పరిసరాలను ఆక్రమిస్తూ సహజ నీటి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పెద్ద ప్రమాదం సంభవించే అవకాశముందని మేము భావిస్తున్నాము. అందువల్ల, తమరు స్పందించి వెంటనే సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ, జి.హెచ్.ఎం.సి. అధికారులతో ఆక్రమణలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థ పై సంయుక్త విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.