27 July, 2026 | 1:11 PM

గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు

27-07-2026 12:27 PM

బోధన్, జూలై 27 (విజయక్రాంతి): బోధన్ మండలం బెల్లాల్ గ్రామపంచాయతీలో(Bellal Gram Panchayat) 15వ ఆర్థిక సంఘం (15వ ఫైనాన్స్) మరియు జనరల్ ఫండ్స్ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వార్డు సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ప్రకారం, గ్రామసభ సమావేశాల్లో హాజరు పట్టికపై సభ్యుల సంతకాలు తీసుకున్న అనంతరం, వారి సమక్షంలో కాకుండా తీర్మానాలు నమోదు చేశారని ఆరోపించారు. అలాగే 40 సిమెంట్ పైపుల కొనుగోలు పేరుతో రూ.2.83 లక్షలు, సబ్‌మర్సిబుల్ బోరు మోటారు కొనుగోలు పేరుతో రూ.1.05 లక్షల బిల్లులు చేసి, ఆ మొత్తాలను నేరుగా సరఫరాదారులకు చెల్లించకుండా సర్పంచ్ భార్య ఖాతాకు మళ్లించారని పేర్కొన్నారు.

2026 జనవరి 1 నుంచి జూలై 1 వరకు గ్రామపంచాయతీలో జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించి, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు, గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరారు. ఇవి వార్డు సభ్యులు చేసిన ఆరోపణలు మాత్రమే. వీటిపై సంబంధిత ప్రజాప్రతినిధుల వివరణ, అధికారుల విచారణ జరిపించాలని బోధన్ ఆర్డిఓ కు వినతిపత్రం అందజేశారు.