ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం
గర్భసంచి తొలగింపునకు కారణమయ్యాడని మహిళ ఆరోపణ
బోధన్, జూలై 27 (విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని ఉషోదయ కాలేజీ సమీపంలో నివాసం ఉంటున్న షేక్ సిమా తనకు జరిగిన అన్యాయంపై మీడియా ద్వారా న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం.. దాదాపు పదేళ్ల క్రితం పోతంగల్ మండలం జల్లాపల్లి ఫారం గ్రామానికి చెందిన, ప్రస్తుతం గ్రామ సర్పంచ్‌గా ఉన్న దస్తాగిర్‌తో తనకు ప్రేమ పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఆ సమయంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, అనంతరం పెళ్లికి నిరాకరించడంతో తన తల్లిదండ్రులు మరో వ్యక్తితో వివాహం జరిపించారని చెప్పారు.
అయితే, దస్తాగిర్ తన మొదటి భర్తను సంప్రదించి తమ మధ్య ప్రేమ వ్యవహారం ఉందని చెప్పడంతో కుటుంబంలో విభేదాలు తలెత్తి చివరకు విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని ఆరోపించారు. అనంతరం తల్లిదండ్రులు మరోసారి తనకు వివాహం జరిపించినప్పటికీ, రెండో భర్త వద్ద కూడా ఇదే తరహాలో మాట్లాడి విడాకులు తీసుకునేలా చేశాడని పేర్కొన్నారు. విడాకుల అనంతరం తనను తానే వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి, బోధన్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని గత ఆరు సంవత్సరాలుగా తనతో సహజీవనం కొనసాగించాడని తెలిపారు. ఈ క్రమంలో తాను గర్భవతి కావడంతో గర్భస్రావం చేయించడమే కాకుండా, తన అనుమతి లేకుండా గర్భసంచికి సంబంధించిన ట్యూబులను తొలగించే శస్త్రచికిత్స చేయించారని ఆరోపించారు. అనంతరం ఇప్పుడు పెళ్లికి పూర్తిగా నిరాకరిస్తున్నాడని వాపోయారు.
ఈ ఘటనలో దస్తాగిర్‌తో పాటు తనకు వైద్యం చేసిన ఆర్‌ఎస్‌పీ ఆస్పత్రి వైద్యుడిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని షేక్ సిమా ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరారు. అలాగే తన సమస్యను ప్రజలకు తెలియజేసి న్యాయం జరిగేలా మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పై ఆరోపణలు షేక్ సిమా చేసిన ఫిర్యాదులో పేర్కొన్నవే. వీటిపై సంబంధిత వ్యక్తుల స్పందన, పోలీసు అధికారులు అపాచీ నమోదు చేశారు కానీ అరెస్టు చేయలేదు. ఇకనైనా స్పందించి వారిని అరెస్ట్ చేయాలని గ్రామస్తులు తెలిపారు.






