తన మాట నిలబెట్టుకున్న బోయినిపేట కౌన్సిలర్
రెండు నెలల వేతనంతో పేదలకు నిత్యావసరాల పంపిణీ
మంథని, జూలై 27 (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మంథని పురపాలక సంఘం 6వ వార్డు (బోయిన్‌పేట్) కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి కుమార్ తన ఉదారతను చాటుకున్నారు. తనకు వచ్చిన రెండు నెలల కౌన్సిలర్ వేతనంతో స్థానిక నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి ఆదర్శంగా నిలిచారు. బోయిన్‌పేట్ ప్రాంతానికి చెందిన నాలుగు నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారికి ఉచితంగా బియ్యం, కిరాణా సామగ్రి, ఇతర నిత్యావసర వస్తువులను ఆమె స్వయంగా పంపిణీ చేశారు.
హామీ నెరవేర్చడమే నా ధ్యేయం
ఈ సందర్భంగా కౌన్సిలర్ శ్రీలత క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వార్డు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం, నాకు వచ్చే ప్రతి నెల కౌన్సిలర్ వేతనాన్ని ప్రజల సంక్షేమానికే ఖర్చు చేస్తానని చెప్పాను. ఆ మాటను ఆచరణలో నిలబెట్టుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని, వార్డు ప్రజల విశ్వాసమే నా అతిపెద్ద బలం అని, వారి నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనని అన్నారు.
స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి.. నిస్వార్థ సేవలో
ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ప్రజా ఆశీర్వాదంతో ఘన విజయం సాధించానని ఆమె గుర్తుచేశారు. పేద కుటుంబాల ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వారికి అండగా నిలవడం, నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడమే తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. బోయిన్‌పేట్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, నీతి, నిజాయితీ, నిస్వార్థ సేవతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వార్డు ప్రముఖులు పాల్గొని కౌన్సిలర్ ఉదారతను అభినందించారు.






