27 July, 2026 | 1:36 PM

పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ భారీ ధర్నా

27-07-2026 12:59 PM
  1. రైతాంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
  2. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నేతృత్వంలో నిరసన
  3. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

పెద్దపల్లి, జూలై 27 (విజయక్రాంతి): జిల్లాలోని రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్(Peddapalli Collectorate) ఎదుట భారీ ధర్నా(BRS protest) నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... వర్షాకాలం మొదలై పంటలు సాగవుతున్న తరుణంలో రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా సమృద్ధిగా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయానికి 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలన్నారు. యూరియా సహా ఇతర ఎరువులను ఎలాంటి కొరత లేకుండా రైతులకు తక్షణమే అందుబాటులో ఉంచాలని, ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్న వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

బాకీల చెల్లింపు

గతంలో మొక్కజొన్న పంటను విక్రయించిన రైతులకు ఇంకా డబ్బులు అందని రైతులకు మద్దతు చెల్లింపులను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలి. రైతాంగ సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడి, తక్షణమే స్పందించి పరిష్కరించాలని కోరుతూ ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు,  రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.