27 July, 2026 | 1:36 PM

ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం

27-07-2026 12:36 PM

ఎల్-నినో పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య

టేకులపల్లి, (విజయక్రాంతి): రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంతో పాటు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై(Scientific agricultural practices) అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న విత్తన మేళా–2026ను టేకులపల్లి మండలం ముత్యాలంపాడు ఎక్స్‌రోడ్డులోని రైతు వేదికలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి విత్తన మేళాను ప్రారంభించిన ఆయన, వివిధ రకాల విత్తనాల స్టాళ్లను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎల్-నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ స్థానిక పరిస్థితులకు అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకుంటే అధిక దిగుబడులు సాధించ వచ్చన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు శాస్త్రీయ సాగు విధానాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఇలాంటి విత్తన మేళాలను నిర్వహిస్తోందన్నారు.

రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, సహాయ వ్యవసాయ సంచాలకుడు  లాల్ చంద్, వ్యవసాయ అధికారి అన్నపూర్ణ, వ్యవసాయ విస్తరణ అధికారులు, ముత్యాలంపాడు ఎక్స్‌రోడ్డు సర్పంచ్ బానోత్ పూలబంతి తదితరులు పాల్గొన్నారు.