నేరడిగొండ తండాలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం
- అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
- ఇచ్చోడ సీఐ సి.హెచ్. రమేష్
గుడిహత్నూర్, (విజయక్రాంతి): ప్రజల భద్రత, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను(Community Contact Program ) నిరంతరం నిర్వహిస్తున్నట్లు ఇచ్చోడ సీఐ సిహెచ్ రమేష్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరడిగొండ తండాలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో గ్రామంలోని వాహనాలు, అనుమానిత వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇద్దరి వద్ద నుంచి నాలుగు లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, 30 లీటర్ల ఐడీ వాష్ (బెల్లం పాకం)ను ధ్వంసం చేశారు. 28 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, రెండు ట్రాక్టర్లను తనిఖీ చేశారు.
తనిఖీల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించని వాహనదారులపై 54 చలానా కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ సిహెచ్ రమేష్ మాట్లాడుతూ గ్రామాల్లో గుడుంబా తయారీ, విక్రయం, మాదకద్రవ్యాలు, అక్రమ రవాణా, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే పత్రాలు కలిగి ఉండాలని, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజలు తమ పరిసరాల్లో జరిగే అనుమానాస్పద లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాల గురించి వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు ఎల్ శ్రీకాంత్, సయ్యద్ ఇమ్రాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






