17 June, 2026 | 1:09 AM

హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కమిటీ

17-06-2026 12:00 AM

కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

శారీరక శ్రమతో సమాజానికి సేవ చేస్తున్న హమాలీ కార్మికులు

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎ.కోదండరాం

ముషీరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): తెలంగాణ హమాలీ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం అధ్యక్షతన నిర్వహించిన ’తెలంగాణ హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు సాధన’ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

తాను కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. గత పదేళ్లలో కనీస వేతనాలు పెరగలేదని, ప్రస్తుతం యాజమాన్యాలతో చర్చించి కార్మికులకు ఇబ్బందులు కలగకుండా కనీస వేతనాలను పెంచినట్లు చెప్పారు. హమాలీల సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు పండించిన పంటల కొనుగోలు ప్రక్రియలో హమాలీల పాత్ర అత్యంత కీలకమని, వారి కృషి వల్లే రైతులకు ఇబ్బందులు లేకుండా వ్యవస్థ నడుస్తోందని మంత్రి పేర్కొన్నారు.

హమాలీల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు విషయాన్ని పరిశీలించేందుకు తక్షణమే కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు. గతంలో హమాలీలకు రూ.2 లక్షల ప్రమాద బీమా మాత్రమే ఉండేదని, ప్రస్తుతం ఇందిరా జీవన్ భీమా పథకం ద్వారా రూ.5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తోందని చెప్పారు.

ఎమ్మెల్సీ ఎం.కోదండరాం మాట్లాడుతూ హమాలీలు తమ శారీరక శ్రమతో సమాజానికి సేవ చేస్తున్న కార్మికులని పేర్కొన్నారు. వారి ఆశలను వమ్ము చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు10 లక్షల మంది కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కార్మికుల కోసం కాలనీలు నిర్మించారని గుర్తు చేశారు.

అదే తరహాలో ప్రస్తుత ప్రభుత్వం కూడా సబ్సిడీతో కార్మికులకు గృహాలు నిర్మించి, మిగిలిన మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం కల్పించాలని సూచించారు. కార్మికుల పిల్లల విద్య, వైద్యం, సామాజిక సంక్షేమంపై ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తే ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి అన్నేడి వెంకట్ రెడ్డి, పలు సంఘాల నేతలు కన్నెగంటి రవి, మీరా సంఘమిత్ర, ఎం.రాజు, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.