15 August, 2026 | 1:57 AM

భరోసా కేంద్రంలో కమిషనర్ ఎన్. శ్వేత ఆకస్మిక తనిఖీ

15-08-2026 12:56 AM

జనగామ, ఆగస్టు 14 (విజయక్రాంతి): మహిళలు, చిన్నారులు ఇతర బాధితులకు అండగా నిలిచే జనగామ భరోసా కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందిస్తున్న వివిధ సేవలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితులకు ఇస్తున్న కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సేవలు, మానసిక పరామర్శ, పునరావాస కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

కేంద్రానికి వచ్చే ప్రతి బాధితుడిని సానుభూతితో, గౌరవ ప్రదంగా ఆదరించాలని, వారి సమస్యలను ఓపికగా విని సత్వర పరిష్కారం చూపాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. భరోసా కేంద్రం అనేది ఒకే వేదికపై అన్ని రకాల సహాయాలు అందించే ప్రదేశం.

కాబట్టి ప్రతి కేసును నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యంగా బాధితుల గోప్యతను కాపాడడానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ సందర్శనలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, భరోసా కేంద్రం ఇన్స్పెక్టర్ సువర్ణ, ఏసీపీలు భీం శర్మ, నర్సయ్య, ఇన్స్పెక్టర్లు సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది సుధా, దయామని, స్వాతి, అపర్ణ, సునీత, హరిత తదితరులు పాల్గొన్నారు.