15 August, 2026 | 2:45 AM

సంగారెడ్డి గడ్డపై రేవంత్ అడుగు!

15-08-2026 01:54 AM

నేడు అంబేద్కర్ మైదానంలో బహిరంగ సభ 

లక్ష మంది తరలింపునకు ఏర్పాట్లు

రాష్ట్రవ్యాప్త ‘స్మార్ట్ రేషన్ కార్డుల’ పంపిణీకి శ్రీకారం

సంగారెడ్డి బ్యూరో, ఆగస్టు 14 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సంగారెడ్డిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో సీఎం నిర్వహిస్తున్న మొట్టమొదటి అధికారిక పర్యటన కావడంతో అధికార యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు దీనిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీ జగ్గారెడ్డి నేతృత్వంలో దాదాపు లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కోటి 5 లక్షల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం అందించే సరికొత్త క్యూఆర్ కోడ్ ఆధారిత పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సీఎం ఇక్కడి నుంచే ప్రారంభించనున్నారు. మిగిలిన 32జిల్లాల్లోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు  ఒకేరోజు కార్డులు పంపిణీ చేస్తారు.

పర్యటన షెడ్యూల్ ఇలా..

కందిలోని ఐఐటీ హైదరాబాద్ హెలిప్యాడ్‌కు హెలికాప్టర్‌లో మధ్యాహ్నం ముఖ్యమంత్రి చేరుకుంటారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో సంగారెడ్డి ఐబీ వద్దకు చేరుకుని అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ప్రధానులు పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, రాజీవ్‌గాంధీ కాంస్య విగ్రహాలను ఆవిష్కరిస్తారు. అనంతరం అంబేద్కర్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి చేరుకుని, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనంతరం సీఎం ప్రసంగిస్తారు. 

వరాల జల్లు కురిపించేనా?

రాజకీయంగా ఉమ్మడి మెదక్ జిల్లా అంతటా ఈ పర్యటనపై భారీ ఆశలు నెలకొన్నాయి. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పెండింగ్ పడిన జిల్లా అభివృద్ధి పనులకు, మౌలిక వసతుల కల్పనకు సీఎం రేవంత్‌రెడ్డి నిధుల వరద పారిస్తారని స్థానిక ప్రజలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి నియోజకవర్గానికి కొత్త ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై సీఎం ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు గతంలో ఏ ముఖ్యమంత్రి సంగారెడ్డికి వచ్చినా పదవి గండం ఉంటుందనే ఒక రాజకీయ సెంటిమెంట్ ప్రచారంలో ఉన్నది.

అయితే ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మని రేవంత్‌రెడ్డి, నేరుగా సంగారెడ్డి గడ్డపై అడుగుపెట్టి ప్రజా సంక్షేమ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ద్వారా ఆ పాత సెంటిమెంట్‌కు గట్టి సమాధానం చెప్పబోతున్నారని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తంచేస్తున్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ పర్యవేక్షణలో భారీ భద్రతా ఏర్పాట్లుచేశారు. దాదాపు 1,500 మంది పోలీసు సిబ్బందితో పట్టణంలో గట్టి బందోబస్తు నిర్వహించనున్నారు. ఈ పర్యటనతో సంగారెడ్డి అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.