22 March, 2026 | 4:07 AM

వాణిజ్య గ్యాస్ సరఫరా 20శాతం పెంపు

22-03-2026 12:47 AM
  1. రేపటి నుంచి అమలు 
  2. కేంద్రం కీలక నిర్ణయం
  3. హోటళ్లు, దాబాలకు గ్యాస్ కొరత ఉండొద్దు
  4. రాష్ట్రాలను కోరిన కేంద్రం

న్యూఢిల్లీ, మార్చి 21: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో వాణిజ్య గ్యాస్ సరఫరాను 20శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ నీరజ్ మిట్టల్ లేఖ రాశారు. రాష్ట్రాలకు అదనంగా మరో 20శాతం కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించారు.

ఈనెల 23వ తేదీ నుంచి అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల 10శాతం కమర్షియల్ గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని నీరజ్ మిట్టల్ స్పష్టం చేశా రు. తాజాగా మరోసారి 20 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను సూచించారు. పారిశ్రామిక క్యాంటీ న్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పాడి పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలతో నడిపించే రాయితీ క్యాంటీన్లు, అవుట్లెట్లు, కమ్యూనిటీ కిచెన్లకు సరఫరా అయ్యేలా చూడాలని ఆయా రాష్ట్రాలకు నీరజ్ మిట్టల్ సూచించారు.