22 March, 2026 | 2:25 AM

భారత్‌కు భారీ ఉపశమనం

22-03-2026 12:47 AM

హోర్ముజ్ నుంచి ప్రయాణానికి సిద్ధమైన జగ్ వసంత, పైన్ గ్యాస్ ఎల్పీజీ నౌకలు

గల్ఫ్ ప్రాంతంలో ఇంకా భారత్ నౌకలు 22

టెహ్రాన్, మార్చి 21: అత్యంత ఉద్రిక్తతలు నెలకొన్న హోర్ముజ్ జలసంధి నుంచి భారత్‌కు చెందిన రెండు ఎల్పీజీ నౌకలు జగ్ వసం త, పైన్ గ్యాస్ నౌకలు ప్రయాణానికి సిద్ధమయ్యాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యం త కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఈ రెండు ఎల్పీజీ ట్యాం కర్లు సన్నద్ధమవుతున్నాయి. గత 24 గంటలుగా ఈ మార్గంలో ముడి చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయినప్పటికీ, భారత్ నౌకలు ‘పైన్ గ్యాస్’, ‘జగ్ వసంత’ తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ ప్రాంతం లో వందలాది నౌకలు నిలిచిపోయిన తరుణంలో, భారత నౌకల కదలికలు కీలకంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురు, సహజ వాయువులో దాదాపు 20 శాతం ఈ ఇరుకైన జలసంధి గుండానే వెళుతుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అమెరికా -ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమపై ఆంక్షలు విధిస్తే గల్ఫ్ నుంచి వెళ్లే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించడంతో ఇంధన మార్కె ట్ ఆందోళనలో ఉంది.

మార్చి 18న ఒక ఖాళీ చమురు ట్యాంకర్ వెనక్కి తిరిగి వెళ్లడం ఇక్కడి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో భారత్కు చెందిన 22 నౌకలు ఉన్నాయి. వీటి సురక్షిత ప్రయాణం కోసం కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ తీవ్రంగా కృషి చేస్తోంది. భారత నౌకల ప్రయాణానికి ఎలాం టి ఆటంకం కలగకూడదని, సురక్షిత మార్గం ఉండాలని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ప్రధాని నరేం ద్ర మోదీ కూడా ఈ విషయంలో ప్రపంచ దేశాల నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు.