4 July, 2026 | 1:11 AM

అత్యాధునిక వైద్యం అందించడమే లక్ష్యం

04-07-2026 12:23 AM

28 నగరాల్లో సంస్థ కార్యకలాపాలు ప్రారంభం  

దేశ ఆరోగ్యరంగంలోనే కొత్త అధ్యాయం

ఆస్టర్ క్వాలిటీ కేర్

హైదరాబాద్, జూలై 3(విజయక్రాంతి): ఆస్టర్ డీఎం హెల్త్‌కేర్, క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ విలీనం పూర్తికావడంతో ఏర్పడిన ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ లిమిటెడ్ జూలై 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ విలీనంతో ఆస్టర్ డీఎం, కేర్ హాస్పిటల్స్ , ఎవర్కేర్, కిమ్స్ హెల్త్ అనే నాలుగు ప్రముఖ ఆరోగ్య సంస్థలు ఒకే గొడుగు కిందకు వచ్చాయి.

ఈ విలీనం రెండు సంస్థల కలయిక మాత్రమే కాదు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయి వైద్య సేవలు, నిపుణుల చికిత్స, అత్యాధునిక వైద్య సాంకేతికతను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలనే ఉమ్మడి లక్ష్యంతో ఈ సంస్థ ముందుకు సాగుతోంది. కొత్త సంస్థకు డాక్టర్ అజాద్ మూఫెన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతుండగా, వరుణ్ ఖన్నా మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈఓగా బాధ్యతలు నిర్వహించనున్నారు.  విలీన సంస్థ కార్యకలాపాల ప్రారంభం సందర్భంగా ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ అజాద్ మూఫెన్ మాట్లాడుతూ, ‘ఆస్టర్, క్వాలిటీ కేర్ ఒకే సంస్థగా మారడం మా ప్రయాణంలో కీలక ఘట్టం. ఇది రెండు ఆసుపత్రుల నెట్‌వర్క్‌లు కలవడం మాత్రమే కాదు.

ఒకే విలువలు, నాణ్యమైన వైద్యం, అనుభవజ్ఞులైన వైద్యులు, రోగుల పట్ల నిబద్ధత కలిగిన రెండు సంస్థలు కలిసి మరింత బలమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మిస్తున్నాయి. భవిష్యత్లో భారతదేశ ఆరోగ్య అవసరాలను మరింత సమర్థంగా తీర్చగల సంస్థగా ఎదుగుతాం’ అని తెలిపారు. ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్ మేనేజింగ్ డైరెక్టర్, గ్రూప్ సీఈఓ వరుణ్ ఖన్నా మాట్లాడుతూ, ‘ఈ విలీనంతో ఒకదానికొకటి బలంగా తోడ్పడే రెండు ఆరోగ్య సంస్థలు ఒకటయ్యాయి. ప్రతి నిర్ణయంలో రోగులు, వారి కుటుంబాల ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తాం. డిజిటల్ సాంకేతికతను మరింతగా వినియోగిస్తూ నాణ్యమైన వైద్య ఫలితాలపై దృష్టి పెడతాం.

ప్రస్తుతం రోగుల చికిత్సకు ఎలాంటి అంతరాయం కలగకుండా విలీన ప్రక్రియను సజావుగా పూర్తి చేయడమే మా మొదటి లక్ష్యం. వైద్యులు, ఉద్యోగులు, భాగస్వాములు, రోగులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మార్పును అనుభవించేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. కాగా ప్రస్తుతం సంస్థకు 28 నగరాల్లో 39 ఆసుపత్రులు, 10,600కు పైగా పడకలు ఉన్నాయి. నాగ్పూర్, ఔరంగాబాద్, విజయవాడ, గుంటూరు, భువనేశ్వర్, రాయ్పూర్, నాగర్కోయిల్, కొల్హాపూర్, కన్నూర్, కాసర్గోడ్, కొట్టక్కల్ వంటి టియర్-2, టియర్-3 నగరాల్లో అత్యాధునిక వైద్య సేవలను విస్తరించనుంది.

దీంతో క్లిష్ట చికిత్సల కోసం మెట్రో నగరాలకు వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది. రాబోయే సంవత్సరాల్లో సంస్థలోని మొత్తం పడకల సంఖ్యను 15 వేలకుపైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 45 వేలకుపైగా వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సేవల నిపుణులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. సంస్థ విస్తరణతో మరిన్ని వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడటంతో పాటు దేశవ్యాప్తంగా నాణ్యమైన వైద్య సేవలు మరింత మంది ప్రజలకు చేరువ కానున్నాయి.