కాట్రపల్లిలో.. అపారమైన గుప్త నిధులు!?
కాకతీయుల కాలం నాటి గ్రామంగా గుర్తింపు పొందిన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో అపారమైన గుప్త నిధులు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇక్కడ 12వ శతాబ్దంలో ఆనాటి కాకతీయుల పాలనలో అద్భుతమైన శిల్ప నైపుణ్యంతో నిర్మించిన శివాలయం, అతిపెద్ద తటాకం, ప్రాచీన ఆనవాళ్లు ఉండటం వల్ల ఇక్కడ భూగర్భంలో గుప్త నిధులు ఉన్నట్లు చెబుతున్నారు.
పాతికేళ్ల క్రితం ఆలయ సమీపంలోని ప్రదేశంలో పెద్ద రాతిబండ చుట్టూ మరికొన్ని చదరపు ఆకారంలో ఉన్న బండరాళ్లు ఉన్నాయి. వీటి అడుగు బాగాన ఆనాటి పాలకుల కు సంబంధించిన నగలు వజ్రవైఢూర్యాలు ఉన్నట్లు ఇప్పటికీ గ్రామంలో ప్రచారం ఉంది. కొన్నేళ్ల క్రితం గుప్త నిధుల కోసం కొందరు తవ్వకాలు చేయడానికి ప్రయత్నించగా అక్కడ అనేకమైన శ్వేత నాగులు ప్రత్యక్షమై వారి పన్నాగాన్ని తిప్పి కొట్టినట్లు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. అనేకసార్లు గుప్తనిధుల తవ్వకాల కోసం విఫలయత్నాలు కూడా జరిగాయి.
ఈ నేపథ్యంలో గ్రామస్తులంతా కొన్ని ఏళ్ల క్రితం అప్పటి మాజీ సర్పంచ్ దసురు నాయక్ ఆధ్వర్యంలో అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌కు తమ గ్రామంలో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని ప్రభుత్వ అనుమతితో వెలికి తీయాలంటూ విజ్ఞప్తి కూడా చేశారు. అయితే గుప్త నిధుల వ్యవహారంపై ప్రభుత్వం అప్పట్లో స్పందించలేదు. దీనితో గుప్త నిధులు ఉన్నట్లు చెబుతున్న ప్రదేశాన్ని ఎవరు కూడా ముట్టుకునే సాహసం చేయడం లేదు. ఇటీవల ఆనాటి కాకతీయుల శిల్పసంపదకు నిదర్శనమైన శివాలయాన్ని రూ.4.50 కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో గుప్త నిధులు ఉన్నట్లు చెబుతున్న ప్రదేశాన్ని కూడా పరిరక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
బండి సంపత్ కుమార్, మహబూబాబాద్, విజయక్రాంతి






