ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి సహకరించాలి
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు
బాల్య వివాహాల నిర్మూలనలో సర్పంచుల పాత్ర కీలకం
మెరుగైన పనితీరు కనబరిస్తే సర్పంచులకు అవార్డులు
గద్వాల టౌన్: ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు, బాల్యవివాహాలను నిర్మూలించేందుకు సర్పంచులు, కౌన్సిలర్లు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూల్లో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో బుధవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో పాఠశాల విద్యా కార్యక్రమాలపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏదైనా గ్రామంలో బాల్య వివాహం జరుగుతుందంటే సంబంధిత సర్పంచ్ లకు తప్పకుండా తెలుస్తుందని, బాల్య వివాహాలకు సహకరించిన వారందరికీ చట్టపరంగా శిక్షలు పడతాయని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలపై పర్యవేక్షణ చేసే బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని పాఠశాలల్లో పూర్తిస్థాయిలో టాయిలెట్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మరమ్మత్తులు చేయడమే కాక మన ఊరు మన బడిలో మంజూరై పెండింగ్ లో ఉన్న అదనపు తరగతి గదుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వము విద్యార్థులకు ప్రత్యేక కిట్స్ ఇవ్వనున్నట్లు చెప్పారు. మెరుగైన పనితీరు కనబరిచే సర్పంచులకు ప్రతి మండలం నుంచి అయిదుగురు చొప్పున ఆగస్టు 15న అవార్డులు అందించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రకటించారు. అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పదో తరగతి ఫలితాల్లో టాపర్స్ గా నిలిచిన వివిధ పాఠశాలల విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.






