పాఠశాల, కళాశాలలో కలెక్టర్ తనిఖీ
ఘట్ కేసర్, మార్చి 11 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, ఉప్పల్ జోన్, ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో భాగంగా కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి, నాణ్యత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను, వారి అభ్యాసన తీరును అడిగి తెలుసుకున్నారు.
కళాశాల కార్యకలాపాలు, రికార్డులు ఇతర వసతులను తనిఖీ చేశారు. కళాశాల నిర్వహిస్తున్న విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల ప్రగతి పట్ల కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన నాణ్యతను కొనసాగించాలని అధికారులను, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ తహసిల్దార్ చంద్రశేఖర్, ఆర్‌ఐ సాయిరాం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




