12 March, 2026 | 1:34 AM

సీఎం వ్యాఖ్యలు దురదృష్టకరం

12-03-2026 12:00 AM

బడంగ్పేట్, మార్చి 11(విజయక్రాంతి): మున్సిపల్ శాఖపై కనీస అవగాహన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.

బుధవారం తెల్లవారుజామున 5 గంటలకే ఆమె మీర్పేట్ ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులను కలిసి, వారి కష్టసుఖాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారని సబితా గుర్తు చేశారు. సుమారు 4,000 చెత్త ఆటోలు పంపిణీ చేయడంతో పాటు, ఏడాదికి రెండుసార్లు వేతనాలు పెంచిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ప్రాణాలకు తెగించి కరోనా కష్టకాలంలో వీధులు శుభ్రం చేసిన కార్మికులను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటని ఆమె ధ్వజమెత్తారు.

గత రెండేళ్లుగా కార్మికులకు పీఎఫ్ జమ కావడం లేదని, ఇన్సూరెన్స్ సౌకర్యం లేదని, కనీసం రక్షణ పరికరాలు కూడా సరిగ్గా అందడం లేదని కార్మికులు తన వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆమె తెలిపారు.మున్సిపల్ వ్యవస్థపై అవగాహన పెంచుకుని మాట్లాడాలి తప్ప, కష్టపడి పని చేసే కార్మికుల మనోభావాలను దెబ్బతీయడం సీఎం కి తగదు అని ఆమె హితవు పలికారు. కార్యక్రమంలో బడంగ్పేట్ సర్కిల్ డీసీ సరస్వతి, స్థానిక అధికారులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.