23 July, 2026 | 5:42 PM

జలసిరి పనులు ప్రారంభించిన కలెక్టర్

23-07-2026 04:45 PM

కుబీర్ (విజయక్రాంతి):  జిల్లాలో భూగర్భ జలాల పెంపుకు ప్రభుత్వం పూజల పరిరక్షణ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు.గురువారం కుబీర్ మండలం దోడర్న గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా, ఫామ్ పాండ్ నిర్మాణ శంకుస్థాపన చేశారు. గ్రామానికి చెందిన రైతు దంపతులు గోరేకర్ సంతోష్, సాగరలకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో, ఫామ్ పాండ్ నిర్మాణానికి కలెక్టర్  భూమిపూజ చేసి, శంకుస్థాపన చేశారు. ఫామ్ పాండ్ నిర్మాణానికి ముందుకు వచ్చిన రైతులను ఈ సందర్భంగా కలెక్టర్ శాలువాతో సన్మానించి, అభినందించారు.

వారి వ్యవసాయానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూగర్భ జలాల సంరక్షణకు ఫామ్ పాండ్ ల నిర్మాణాలు దోహదం చేస్తాయని వివరించారు. ప్రతి రైతు బాధ్యతగా తమ వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ పాండ్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రభుత్వం ఈ నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందజేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువ ఉన్నాయని, ఇటువంటి నీటి నిల్వ నిర్మాణాల వల్ల అత్యవసర పరిస్థితుల్లో పంటకు నీరు అందుతుందని తెలిపారు. భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. రైతులు పెద్ద ఎత్తున ఫామ్ పాండ్ ల నిర్మాణానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ విజయలక్ష్మి, తహసిల్దార్ శ్రీదేవి, ఎంపీడీఓ శ్రీనివాస్, సర్పంచ్ జాదవ్ సావిత్రి, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.