17 June, 2026 | 3:42 AM

వైద్య సిబ్బంది తీరుపై కలెక్టర్ ఆగ్రహం

17-06-2026 02:25 AM

రాజోలి పీహెచ్సీలో ఇద్దరికి షోకాజ్ నోటీసులు

నెల రోజుల్లో పనితీరు మెరుగుపరచాలని హెచ్చరిక

అలంపూర్, జూన్ 17: జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా మంగళవారం రాజోలి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సిబ్బంది పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రి హాజరు రిజిస్టర్ను పరిశీలించిన సందర్భంగా రంజిత్ కుమార్, కిష్టమ్మ అనే ఇద్దరు సిబ్బంది చాలా రోజులుగా విధులకు హాజరు కాకపోవడంతో పాటు రిజిస్టర్లో సంతకాలు చేయకపోవడాన్ని గుర్తించిన కలెక్టర్, వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలోని వివిధ రిజిస్టర్లు, రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంపై సంబంధిత అధికారులను మందలించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య తక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేసిన కలెక్టర్, ప్రభుత్వం అందిస్తున్న కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు, ఉచిత మందుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి మరింత మంది రోగులకు సేవలు అందించాలని సూచించారు. రాబోయే నెల రోజు ల్లోగా ఆసుపత్రి సిబ్బంది తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.