సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, జగ్గారెడ్డి
సంగారెడ్డి, ఆగస్టు 10 (విజయక్రాంతి) : సంగారెడ్డి పట్టణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కలిసి పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా సభలు, కార్యక్రమాలు నిర్వహించనున్న అంబేద్కర్ స్టేడియం, తారా డిగ్రీ కళాశాల ప్రాంగణాలను వారు సందర్శించి పరిశీలించారు.
కార్యక్రమానికి వచ్చే ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, బారికేడింగ్, వేదిక ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశించారు. ఈ సందర్భంగా సంబంధిత ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ అధికారులు, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్, తహసిల్దారు, పోలీసు శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






