భారీ వర్షంతో ఓసీ-3 లో నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి/గణపురం,(విజయ క్రాంతి): తుఫాను ప్రభావంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గణపురం మండలంలోని బసరాజుపల్లి సమీపంలోని ఓసీ-3 బొగ్గు గనిలో ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షంతో గనిలో నీరు చేరడంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు బొగ్గు ఉత్పత్తి, రవాణా కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. గనిలో పనిచేస్తున్న డంపర్లు, భారీ యంత్రాలను ఒకేచోట నిలిపివేయగా, విధుల్లో ఉన్న కార్మికులను అధికారులు ఇళ్లకు పంపించారు. వర్షం తగ్గి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే తవ్వకాలు, బొగ్గు రవాణా పనులను పునఃప్రారంభించనున్నట్లు సమాచారం. భారీ వర్షాల నేపథ్యంలో గనిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వర్షం కొనసాగుతున్న నేపథ్యంలో గని ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.






