మహిళల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 8,000 వేల ఇందిరా మహిళా శక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి చెందుతోందని సీఎం చెప్పారు. 29 నెలల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణాలకు రూ. 10 వేల కోట్లు ఆర్టీసీకి చెల్లించామని తెలిపారు. కొంతమందికి మహిళల ఉచిత బస్సు ప్రయాణం నచ్చలేదని చెప్పారు. మహిళలను బస్సులకు యజమానులు చేశామని వెల్లడించారు. అంబానీ, అదానీ చేసే పెట్రోల్ వ్యాపారం మహిళలు కూడా చేయాలనే బంక్ లు పెట్టించామని పేర్కొన్నారు.
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామని వివరించారు. బ్యాంక్ లోన్లు చెల్లింపులో నిర్మల్ జిల్లా మహిళ సంఘాలు తొలి స్థానంలో ఉన్నారని కొనియాడారు. బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. మహిళా సంఘాలు ఉత్పత్తుల గోడౌన్ లకు స్థలాలు ఇస్తామన్నారు. మహిళ దగ్గర నుంచే మిల్లర్లు, వడ్లు తీసుకెళ్లేలా ప్రణాళికలు చేస్తున్నామని వివరించారు.
మహిళా శక్తి సూపర్ బజార్ లు ఏర్పాటు
మహిళ శక్తి సూపర్ బజార్ లు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా శక్తి సూపర్ బజార్ లో మహిళలు పెట్టుబడి పెట్టండన్నారు. నాణ్యమైన ఉత్పత్తులకు మహిళా శక్తి సూపర్ బజార్ లు చిరునామాగా మార్చాలని సీఎం ఆదేశించారు.






