17 March, 2026 | 9:12 PM

ఆంధ్రాకు సీఎం రేవంత్‌రెడ్డి దాసోహం

17-03-2026 12:00 AM
  1. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం
  2. ఢిల్లీ మీటింగ్ మినిట్స్‌పై ఎందుకు స్పందించడం లేదు?
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి): చేతకాని, బాధ్యతలేని, ముందుచూ పు లేని రేవంత్‌రెడ్డి ప్రభుత్వ వైఖరి వల్ల కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో సోమవా రం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ..

నీటి హక్కుల సాధనలో గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. సమైక్య రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ నిరంతరం శ్రమించారని, మన 968 టీఎంసీల హక్కులను స్థిరపరచడానికి యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టి, 400 టీఎంసీల ప్రాజెక్టులకు అనుమతులు సాధించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.

ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ, ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కలిసి తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. కృష్ణాలో నీటి దోపిడీ చేసిన ఏపీ.. ఇప్పుడు ఆదమరిచి నిద్రపోతున్న రేవంత్‌రెడ్డి ప్రభు త్వ చేతకానితనాన్ని ఆసరాగా చేసుకుని గోదావరి జలాలపై పడిందన్నారు. జనవరి 30న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నతాధికారుల సమావేశం ద్వారా తెలంగాణ నీటి హక్కులను హరించేందుకు ఏపీ పక్కా స్కెచ్ వేసిందని, ఆ సమావేశం జరిగి నెల రోజులు దాటిపోయినా అందులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభు త్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

తెలంగాణకు ద్రోహం చేసిన ఆదిత్యనాథ్ దాస్‌ను చైర్మన్‌గా చేసి దొంగ చేతికే తాళాలు ఇచ్చింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వమన్నారు. కృష్ణా నదిలో కనీసం 34 శాతం తాత్కాలిక వాటాను కూడా ఈ కాంగ్రెస్ ప్ర భుత్వం కాపాడుకోలేకపోతోందన్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అక్కడి గవర్నర్ ప్రసంగిస్తూ.. నల్లమల్లసాగర్ నుంచి నీళ్లు తీసుకెళ్లడానికి పనులు ముమ్మరం చే స్తున్నామని గర్వంగా చెప్పారని, మరి తెలంగాణ గవర్నర్ స్పీచ్‌లో.. నల్లమల్ల సాగర్‌ను అడ్డుకుంటామని, గోదావరిలో చుక్క నీటిని కూడా వదులుకోమని ఈ ప్రభుత్వం ఎం దుకు చెప్పించలేకపోయిందని ప్రశ్నించారు.

కృష్ణాతోపాటు గోదావరి నీళ్లను కూడా ఏపీ దోచుకుపోకుండా ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వెంటనే ఆ మీటింగ్ మినిట్స్‌పైన గట్టిగా అభ్యంతరం తెలపాలని సూచించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు గతంలో చంద్రబాబు ఎన్ని కుట్రలు చేశారో, ఎన్ని లేఖలు రాశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు అని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తెలంగాణ నీటి హక్కులను కాపాడాలని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్‌చేశారు.